వంగవీటి రాధాకృష్ణ ఒక ఇంటి వారు కాబోతున్నారు. సెప్టెంబర్ 6న ఆయన వివాహం చేసుకోనున్నారు. దీంతో వంగవీటి అభిమానుల్లో ఆనందం నెలకొంది. అయితే వధువు తల్లిదండ్రులకు కూడా రాజకీయ నేపథ్యం ఉంది. ప్రస్తుతం వారు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. కుటుంబ నేపథ్యంలో పాటు రాధా వ్యక్తిత్వంతో చూసి వధువు తల్లిదండ్రులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
2004లో అతి చిన్న వయసులో వంగవీటి రాధా ఎమ్మెల్యే అయ్యారు. అటు తరువాత పవర్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో పోటీచేసినా ఓటమి ఎదురయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ కు నిరాకరించడంతో అనూహ్యంగా టిడిపిలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో టిడిపి ఓటమి చూసింది. అయినా సరే ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. రాబోయే కాలంలో విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. జనసేనలో చేరతారని కూడా ప్రచారం సాగింది.
పుష్పవల్లి తల్లి అమ్మాని 1987-92ల మధ్య నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా వ్యవహరించారు. తండ్రి బాబ్జి సుదీర్ఘకాలం టిడిపిలో పనిచేశారు. మధ్యలో రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి హైదరాబాదులో స్థిరపడ్డారు. ఇటీవలే నరసాపురం వచ్చి జనసేనలో చేరారు.
రాజకీయంగా బాబ్జి దంపతులు యాక్టివ్ అయ్యారు. పవన్ నరసాపురం లో ఉన్న సమయంలో వీరి ఇంట్లోనే బస చేశారు. ఆ సమయంలోనే తమ కుమార్తె వివాహ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. వంగవీటి రంగా జయంతి సమయంలో రాధా వీరి ఇంటికి వచ్చారు. ఆ సమయంలోనే వివాహ సంబంధం కుదిరినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ,నరసాపురం జనసేన ఇన్చార్జ్ నాయకర్ మధ్యవర్తిత్వంతో ఇరు కుటుంబాలు వివాహ నిశ్చయానికి వచ్చాయి. సెప్టెంబర్ 6న సాదాసీదాగా పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.