Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన పార్టీ విధానాలను ఏడు సిద్ధాంతాలుగా విభజించినట్టు జనసేనాని ప్రకటించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో కరీంనగర్ లోని శుభమ్ గార్డెన్స్ లో సమావేశమైన పవన్ జనసేన భవిష్యత్ రాజకీయ లక్ష్యాలను వివరించారు. జై తెలంగాణ అని నినాదం చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు జనసేనాని. వందేమాతరం ఎలాంటి పదమో, మహా మంత్రమో, జై తెలంగాణ కూడా అంతటి గొప్ప వాక్యమని పవన్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర తనకు జన్మనిస్తే, కరీంనగర్ పునర్జన్మనిచ్చిందని తెలిపారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన వేళ తెలంగాణకు గుండె కాయ అయిన కరీంనగర్ నుంచి ప్రస్థానం ప్రారంభించడం వెనక ఓ కారణముందన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి తనకు పునర్జన్మ ఇచ్చాడని, అలాంటి తెలంగాణ నేల తల్లికి జీవితాంతం, ఆఖరిశ్వాస వరకూ రుణపడి ఉంటానని తెలిపారు.
తెలంగాణ అంటే తనకెంతో ప్రేమని, తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. ఆంధ్ర, తెలంగాణలు వేరైనా అందరూ ఒకటేనన్నారు. ప్రాంతీయ విబేదాలు సమాజానికి మంచిది కాదని హితవుపలికారు. 2019 ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని, ఆ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన బోణీ కొడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. కుల, మత, ప్రాంతీయ తత్వాలు లేని పార్టీ జనసేన అని పవన్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశయసాధనకు కృషిచేస్తానన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘపోరాటానికి జనసైనికులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడంపై తనను విమర్శించిన కాంగ్రెస్ నేతలందరికీ తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని, ప్రజల కోసం పోరాడే ప్రతి ఒక్క నేతనూ తాను ఇష్టపడతానని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారన్న సంగతి ఆ పార్టీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. తనకు అన్ని పార్టీల మీదా అభిమానం ఉందని, ఎవరి మీదా ద్వేషం లేదని స్పష్టంచేశారు. తాను ఏ ఒక్కరితోనూ వ్యక్తిగత శతృత్వం పెట్టుకోదలుచుకోలేదని చెప్పారు. ఈ సమావేశంలో జనసేన ఏడు సిద్ధాంతాలను పవన్ వెల్లడించారు. కులాలని కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం.
ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే విధానం జనసేన సిద్ధాంతాలని పవన్ వివరించారు. ఈ ప్రసంగంలో కొన్నిసార్లు పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానులు అత్యుత్సాహాన్ని ఎక్కువగా చూపొద్దని కోరారు. అద్దాలు పగిలిన కారణంగా గాయాలపాలై, చొక్కా అంతా రక్తం నిండినా, పవన్ ను దగ్గరగా చూసేందుకు ఆతృత పడుతున్న ఓ అభిమానిని స్టేజ్ పైకి పిలిచి మాట్లాడి అతన్ని ఆస్పత్రికి పంపించాలని సూచించారు. తానెంతో ఇష్టపడే అభిమానులకు ఇలాంటి ఘటనలు జరిగితే తాను తట్టుకోలేనన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. అభిమానులు సీఎం… సీఎం అని నినాదాలు చేస్తోంటే పవన్ వారించారు.