ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని విజయావాడలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శనివారం ఉదయం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు సమయంలో జనసేన కార్యాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌కు పండితులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో మతపెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి, పవన్ కల్యాణ్‌ను ఆశీర్వదించారు. తమ అభిమాన కథానాయకుడు, నేత రాకతో అమరావతికి ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పోటెత్తారు.
ఈ ప్రారంభోత్సవం అనంతరం మాజీ స్పీకర్ మనోహర్‌తో పాటు ఇతర ముఖ్య నేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న ఐటీ దాడులు, రాష్ట్ర రాజకీయాలతోపాటు తెలంగాణ ఎన్నికలపై కూడా చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్షించారు. ఇక నుంచి పార్టీ కార్యకలాపాలు అమరావతి కేంద్రంగా కొనసాగుతాయని ఈ సందర్భంగా పవన్ జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కవాతు అనంతరం పర్యటిస్తానని తెలిపారు. సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలిగించరాదనే ఉద్దేశంతోనే ప్రస్తుతం అక్కడ పర్యటించడం లేదని అన్నారు. దృష్టంతా ప్రజలమీద ఉండాల తప్పా, నాయకుల పర్యటనలపై కాదని పేర్కొన్నారు. రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు మరింతగా శ్రమించాలని కోరారు.