Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమరావతిలో జనసేన కార్యకలాపాలకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మించడానికి ఆ పార్టీ ఎంపిక చేసుకున్న స్థలం వివాదాల్లో ఉన్న విషయం బయటకు వచ్చింది. ఇటీవలే గుంటూరు జిల్లా చినకాకానిలో జనసేన కార్యాలయం ఏర్పాటు చేయబోయే ఈ స్థలాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చూసి వెళ్లారు. తమకు పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకునే వీలు కల్పించిన కమ్యూనిస్ట్ నేత యార్లగడ్డ సుబ్బారావు కుటుంబానికి కృతజ్ఞతలు కూడా చెప్పారు. త్వరలో ఇక్కడ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేద్దాం అనుకునే లోపే ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
యార్లగడ్డ సుబ్బారావు కుటుంబంతో ఆ స్థలానికి సంబంధించి ముస్లిం మైనారిటీలకు విభేదాలు వున్నాయి. 1998 లో వీళ్ళ వివాదం లో గుంటూరు కోర్టులో సుబ్బారావుకు చుక్క ఎదురైంది. ఆపై ఈ స్థలంలో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా ముస్లిం మైనారిటీలు హై కోర్టు నుంచి స్టే తెచ్చారు. ఎప్పటి నుంచో ఉన్న స్టే ని లెక్క చేయకుండా ఇక్కడ ఏదైనా కార్యక్రమం తలపెడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ముస్లిం మైనారిటీ నేతలు అంటున్నారు. అక్కడితో ఆగకుండా ఈ స్థలం మీద నెలకొన్న వివాదాన్ని జనసేన దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ తో చినకాకానిలో పార్టీ ఆఫీస్ తో పాటు కుదిరితే ఓ ఇల్లు కూడా కట్టుకుందాం అనుకున్న పవన్ కి పెద్ద దెబ్బ తగిలినట్టు అయ్యింది.