పవన్ కి ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత : జనసేన హెచ్చరిక

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌కు రక్షణ కల్పించడంతో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని… ఆయనకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అంటూ హెచ్చరిస్తున్నారు జనసేన నాయకులు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు అభిమానులు, జనసేన కార్యకర్తలతో కలిసి నిరసన కవాతు చేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత కాశిబుగ్గ బస్టాండ్ వద్ద జరిగే బహిరంగ సభలో పవన్ కల్యాణ్‌ ప్రసగించనున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్రలో తగిన రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని, ఈ పర్యటనలో ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీన పవన్ కళ్యాణ్  ఇచ్ఛాపురంలో జన పోరాట యాత్రకి శ్రీకారం చుట్టినప్పుడే నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు కోరుతూ శ్రీకాకుళం ఎస్పీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులకీ విజ్ఞప్తులు చేసుకున్నామని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి పేరిట విడుదలైన ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే, పోలీసులు రక్షణ కల్పించకుండా ప్రభుత్వం ఆటంకం కల్పిస్తుందని తమకు సమాచారం అందిందని, ఈ ధోరణిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని లేఖలో పేర్కొన్నారు. “ఈ పర్యటనలో ఎక్కడా ప్రజా సమూహానికి ఇబ్బంది కలగకూడదన్నదే మా అధ్యక్షుడి ఉద్దేశం. విశేష జనాదరణ ఉన్న నాయకుడికి, ఆయన పర్యటనకి రక్షణ కల్పించడం విధి అనే బాధ్యతను ప్రభుత్వం కావాలనే విస్మరించింది. పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిరసన కవాతు చేస్తారు. ఆ సందర్భంలో భారీ జన సందోహం ఉంటుంది. ఆ సమయంలో పవన్ కల్యాణ్‌కి రక్షణ అవసరం. ఆ దిశగా పోలీసులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. సోంపేటలో బీల భూముల పరిశీలనకు వెళ్లినప్పుడు, థర్మల్ విద్యుత్‌ కేంద్రం వద్దని పోరాటం చేస్తూ అసువులు బాసిన అమర వీరులకి నివాళులు అర్పించేందుకు వెళ్లినప్పుడు కనీసం ఒక్క పోలీస్ కూడా కనపడలేదని పలాస వచ్చినప్పుడు కూడా అదే విధమైన తీరుని పోలీస్ శాఖ కనపరచడం దారుణమని పేర్కొన్నారు.

రోప్ పార్టీ వచ్చినప్పటికీ కనీస విధి నిర్వహణ చేయకుండా గదులకు పరిమితమయింది. పలాసలో నిరసన కవాతు కోసం ముందుగానే అనుమతి కోరాం. ఆ సమయంలో తగిన పోలీస్ బందోబస్తు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఒత్తిళ్లతో పోలీసులు తాము చేయాల్సిన విధుల్ని పట్టించుకోకపోతే మా పార్టీ తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా రోడ్లు మీదకు వస్తాం. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకొంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. పోలీసుల విధులకు ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ కి కనీస భద్రత కోసం ప్రైవేట్ రక్షణ ఉంది. అయితే మేము పోలీస్ రక్షణకు తొలి ప్రాధాన్యం ఇస్తాం. మరోసారి శ్రీకాకుళం ఎస్పీ గారికి పోలీస్ బందోబస్తు కోసం విజ్ఞప్తి ఇవ్వనున్నాం” అని పేర్కొన్నారు.!

Janasena Pawan Kalyan Security Issue Letter