Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరకొరియా రెచ్చగొట్టే చర్యలు ఆపటం లేదు. అణ్వస్త్రాలతో జపాన్ ను ముంచెత్తుతాం..అమెరికాను బూడిద చేస్తాం అని గురువారం హెచ్చరించిన ఉత్తరకొరియా తర్వాత రోజే మరో క్షిపణి ప్రయోగించింది. జపాన్ మీదగా పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రయోగించిన ఈ ఖండాంతర క్షిపణితో జపాన్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదగా వెళ్తుండటాన్ని రాడార్లు పసిగట్టడంతో జపాన్ హై అలర్డ్ ప్రకటించింది. క్షిపణి జపాన్ లోని ఎరిమో, హోక్సైడో నగరాలపై పడే అవకాశముండటంతో ప్రభుత్వం లౌడ్ స్పీకర్లలో ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. క్షిపణి పడే ప్రమాదముందని, ప్రజలు ఇళ్లల్లో, బంకర్లలో తలదాచుకోవాలని సూచించింది. అప్పుడే నిద్రలేచి పనుల్లో నిమగ్నమవుతున్న ప్రజలు ఈ హెచ్చరికలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. నెలరోజుల వ్యవధిలో ఉత్తరకొరియా ఇలా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగించటం ఇది రెండోసారి.
ఉత్తరకొరియా చర్యలతో జపాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. క్షిపణి పసిఫిక్ మహాసముద్రంలో పడుతుందని తెలిసినప్పటికీ…ఆ మార్గంలో తన 16 నౌకలు ప్రయాణిస్తున్నాయని, దీంతో వణికి పోయానని ఓ జపాన్ వ్యాపారి చెప్పారు. ఈ హెచ్చరికలు వింటూ తాము నిలకడగా ఉండలేకపోతున్నామన్నారు. పొరపాటున క్షిపణి జపాన్ పై కూలితే నగరాలకే నగరాలే ధ్వంసమవుతాయని ఆ దేశ పౌరులు ఆందోళన చెందుతున్నారు. అటు జపాన్ ప్రభుత్వం కూడా ఉత్తరకొరియాపై తీవ్రస్థాయిలో మండిపడింది. క్షిపణి ప్రయోగం నేపథ్యంలో జపాన్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కోరింది. ఇక సహించేది లేదని, ఉత్తరకొరియాకు తగిన సమాధానం చెబుతామని జపాన్ ప్రధాని షింజో అబే అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలని ఐక్యరాజ్యసమితి బలమైన తీర్మానాన్ని తీసుకొస్తే…ఉత్తరకొరియా దాన్ని పట్టించుకోకుండా విపరీత చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తరకొరియా ఇదే వైఖరి కొనసాగిస్తే…ఆ దేశానికి భవిష్యత్తు ఉండదని, ఈ విషయాన్ని ఉత్తరకొరియాకు అర్ధమయ్యేలా చెప్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమయంలో అంతర్జాతీయ కమ్యూనిటీ ఏకమవ్వాల్సిన అవసరముందని అబే పిలుపునిచ్చారు.