Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆవేశం ఎన్ని అనర్థాలను కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఉద్దేశపూరిత నేరాల సంగతి పక్కనపెడితే… సమాజంలో జరుగుతున్న చాలా హత్యలు… క్షణికావేశంలో చోటుచేసుకుంటున్నవే. మనిషి కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. కానీ అన్నివేళలా అది సాధ్యం కాదు. కొన్నిసార్లు ఆవేశం మనిషిలోని విచక్షణను నశింపచేస్తుంది. ఇది అనాలోచిత చర్యలకు దారితీస్తుంది. నిజానికి హత్య చేయడం తప్పని ప్రతి ఒక్కరికి తెలుసు. హత్య చేసిన తర్వాత హంతకుడు లేదా హంతకురాలికి మిగిలేదేమీ ఉండదు. అరెస్టు, పోలీస్ కేసు, జైలు… ఇదే మిగిలిన జీవితమంతా… ఇవన్నీ తెలిసి కూడా ఆవేశాన్ని నియంత్రించుకోలేక… ఎదుటి వ్యక్తి ప్రాణం తీయడంతో పాటు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. తాజాగా ఓ జవాన్ కూడా ఇలానే ఆవేశానికి గురయి దారుణానికి ఒడిగట్టాడు. అతని ఆవేశానికి కారణం… తనలో తలెత్తిన అనుమానం. ఆ అనుమానం, ఆవేశం కలిసి మూడు నిండు ప్రాణాలు బలిగొన్నాయి. నలుగురు పిల్లలను అనాథలుగా మార్చాయి. వివరాల్లోకి వెళ్తే…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం సంగం గ్రామానికి చెందిన 32 ఏళ్ల ఇందలపు సురేందర్ 2014లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ లో సైనికుడిగా ఉద్యోగం తెచ్చుకున్నాడు. అప్పటినుంచి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని దులాస్టిలో ఎన్ హెచ్ పీసీ యూనిట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరుకు చెందిన లావణ్యతో సురేందర్ కు వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా సురేందర్ కుటుంబంతో దులాస్టిలోనే ఉంటున్నాడు. రాత్రి విధులకు వెళ్లిన సురేందర్ తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి తిరిగివచ్చాడు. ఆ సమయంలో పక్కింటి వ్యక్తి రాజేష్ తమ ఇంటి బయట ఉండడంతో సురేందర్ కు భార్యపై అనుమానం వచ్చింది. తన భార్య, రాజేష్ మధ్య అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో సురేందర్ రాజేష్ ను, భార్య లావణ్యను కాల్చిచంపాడు. కాల్పుల శబ్దం విని బయటకు వచ్చిన రాజేశ్ భార్య శోభనూ కాల్చాడు. మహారాష్ట్రకు చెందిన రాజేశ్ దంపతులకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన ఆర్మీలో తీవ్ర కలకలం రేపింది. అటు సురేందర్ సొంతగ్రామంలోనూ ఈ ఘటనతో అలజడి రేగింది. సుదూర ప్రాంతంలో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడనుకున్న తమ కుమారుడు దారుణంగా ముగ్గురిని హతమార్చి హంతకుడిగా మారాడని తెలియడంతో సురేందర్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిందితుడు సురేందర్ ను సస్పెండ్ చేసినట్టు సీఐఎస్ ఎఫ్ అధికారులు ప్రకటించారు. అనాథలయిన రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లల బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.