Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జేసీ దివాకర్ రెడ్డి ఏ పార్టీ లో వున్నా లోడ్ చేసిన గన్ లాంటి వాడు. ఆ గన్ ఎప్పుడు పేలుతుందో ఆయన నోటి నుంచి ఎప్పుడు ఎవరిపైకి బులెట్ దూసుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. సముద్రం లాంటి కాంగ్రెస్ లో కాబట్టి ఆయన ఎంత మాట్లాడినా ఓ అల అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు అయ్యింది. అందుకే జేసీ కి కూడా తనకి నోరు చేస్తున్న నష్టాన్ని గుర్తించలేకపోయారు. కానీ టీడీపీ లోకి వచ్చాక ఆయన నోటిదూకుడుకి ప్రచారం పెరిగింది. వైసీపీ అధినేత జగన్ ని జేసీ బ్రదర్స్ వెంటాడుతుంటే టీడీపీ లో చాలా మంది తమాషా చూస్తూ కూర్చున్నారు. దీంతో జేసీ దూకుడు పెరిగి ఇదిగో ఇండిగో విమానం దాకా వచ్చింది. విశాఖ విమానాశ్రయంలో జేసీ దూకుడుకి కెమెరా సాక్ష్యాలు ఉండటం, ఇండిగో, ఎయిర్ ఇండియా కూడా ఆయనపై చర్యకు పూనుకోవడంతో సీఎం చంద్రబాబు ఆ అంశం మీద దృష్టి పెట్టారు.
జేసీ చర్యలవల్ల దెబ్బ తిన్న పార్టీ ప్రతిష్టని నిలబెట్టేందుకు చంద్రబాబు చర్యలు చేపట్టారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతి రాజుతో మాట్లాడి జేసీ తో క్షమాపణ చెప్పించాక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా చూడాలని కోరారు. అటు సీఎం రమేష్ ని జేసీ వద్దకు పంపించారు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే బహిరంగంగా క్షమాపణ చెప్పడం తప్ప ఇంకో మార్గం లేదని జేసీ కి సీఎం రమేష్ నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. ఆయన ససేమిరా అనడంతో పరిస్థితి విషమించకముందే మేలుకుంటే మంచిదని చంద్రబాబు చెప్పినట్టు సీఎం రమేష్ వివరించగానే జేసీ కొంత మెత్తబడినట్టు తెలుస్తోంది. త్వరలోనే జేసీ దగ్గరనుంచి దీనికి సంబందించిన ప్రకటన రానుంది.