టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు లోక్ సభలో చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన ఈ సమయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అలకపాన్పు ఎక్కడం ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారింది. పార్లమెంటు సమావేశాలకు హాజరుకానని ఆయన స్పష్టం చేశారు. జేసీ ప్రకటన రాజకీయవర్గాల్లో ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తమ ఎంపీలకు టీడీపీ విప్ జారీ చేసింది. అయితే, విప్ జారీ చేసినా తాను పార్లమెంటు సమావేశాలకు వెళ్లబోనని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. విప్ ను ధిక్కరిస్తే జేసీపై చర్యలు తప్పవని బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు. జేసీ ప్రకటన వెనుక సుజనాతో వచ్చిన మనస్పర్ధలే కారణం అని భావిస్తున్నా దానికి మించిన కారణమే ఉందని మరి కొందరు చెబుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలోకి చేరాలని ప్రయత్నిస్తున్నారు.
పార్టీ నాయకత్వం కూడా ఆయన పట్ల సానుకూలంగానే ఉందని తెలుస్తోంది. అయితే, ఆయన చేరికను జేసీ వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు, పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన మథనపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈనెల 25 లోపల తన డిమాండ్లపై అధిష్ఠానం స్పందించాలని… లేకపోతే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్టు సమాచారం. జేసీ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం కల్లా జేసీ విషయంలో పార్టీ స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం నివాసానికి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.