Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయ చాణుక్యుడిగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నారా ?. ఆ ఉచ్చు తగిలించింది ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అని తేల్చేశారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. హోదాకి బదులు ప్యాకేజ్ అని వాళ్ళు చెప్పినప్పుడు పెద్ద మనసుతో చంద్రబాబు ఒప్పుకోవడమే ఆయన ఉచ్చులో పడడానికి కారణం అయ్యిందని జేసీ అంటున్నారు. రాజీనామాలు, అవిశ్వాస తీర్మానం తో ఒరిగేది ఏమీ లేదని కూడా జేసీ కుండ బద్దలు కొట్టారు. వైసీపీ అధినేత జగన్ ఒక్క ఎంపీ తో రాజీనామా చేయించినా తాను కూడా రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. అప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారో అర్ధం అవుతుందని జేసీ కామెంట్ చేశారు. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్య తల్చుకుంటే ఏపీకి న్యాయం జరిగే అవకాశం ఉందని జేసీ అంటున్నారు.
ఇక జేసీ కి భిన్నంగా స్పందించారు టీడీపీపీ నేత తోట నరసింహం. విభజన హామీలు నెరవేర్చడం మీద ఒత్తిడి పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. రెవిన్యూ లోటు, పోలవరం, రైల్వే జోన్, ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాల్లో కేంద్రం సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే తాము కూడా కఠిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి కేంద్రం సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నట్టు సమాచారం ఉందని, అయితే నిర్ణయం ప్రకటిస్తే గానీ ప్రజలకు నమ్మకం కుదరదని తోట వ్యాఖ్యానించారు. ఇక కేంద్రం తో చర్చల్లో పలు దఫాలుగా పాల్గొన్న సీఎం రమేష్ సైతం కేంద్రం వైఖరి మారకుంటే టీడీపీ ఆంధ్రుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటుందని చెప్పారు. టీడీపీ పోరాటం తరువాత కూడా కేంద్రంలో కదలిక కనిపించలేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు. అందుకే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.