స్వచ్చంద పదవి విరమణ చేసి రాజకీయ రంగ ప్రవేశం కోసం ఏర్పాట్లు చేసుకున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. దీనికి కారణాలు ఏమిటా అని ఆయన సన్నిహిత వర్గాలను ఆరా తీయగా ఆయన రాజకీయాల మీద విరక్తి చెందారట. నిజానికి రాజకీయాలపై ఎంతో ఆసక్తిగా ఉన్న ఆయన రెండు నెలల పాటు ఏపీ మొత్తం పర్యటించి ఓ నివేదిక కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కార్యాచరణ విషయంలో మాత్రం వెనుకబడిపోయారు. పకడ్బందీగా అడుగులు వేయడంలో ఆయనకు సరైన రాజకీయ అనుభవం లేకపోవడంతో.. ముందుకు పోలేకపోయారన్న ప్రచారం జరిగింది. సొంత పార్టీనా రాజకీయ పార్టీల్లో చేరుతారా అన్నదానిపై మొదటి నుంచి ఆయన గందరగోళ సమాధానాలే చెప్పారు. ఈ విషయంలో మొదట్లోనే క్లారిటీ ఇచ్చి తనకు ఇష్టమైన పార్టీని ఎంపిక చేసుకుని ఉంటే ఈ పాటికి రాజకీయం ఒంటబట్టి ఉండేది. కానీ గత ఉద్యోగపు ఇమేజ్ ఆయనను వెంటాడుతూనే ఉంది. అందుకే ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టక ఏమి చేసినా ఏమి చేయకపోయినా విమర్శలు వస్తాయి. వాటిని లెక్కలోకి తీసుకుంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఈ విషయంలో వీవీ లక్ష్మినారాయణ ఒప్పుకోలేక పోతున్నారని చెబుతున్నారు. అందుకేనేమో ఎన్నికల ప్రకటన మరో రెండు, మూడు వారాల్లో వస్తుంది తేలిన తర్వాత కూడా.. ఆయన సైలెంట్‌గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆయన ఫలానా పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోన్నా ఆయన వైపు నుంచి అయితే స్పందనలేదు. ఆయన తనకు ఇష్టమైన సేవా రంగంలోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుని ఉంటారని ఈ సారి ఎన్నికల లోపు అయితే రాజకీయాల్లోకి రాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. మరి దీనికి మాజీ జేడీ ఏమని స్పందిస్తారో వేచి చూడాలి, మరి.