Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజ్య సభ సభ్యత్వాన్ని రద్దు చేసే అంశంపై స్పందించేందుకు జేడీయూ నేతలు శరద్ యాదవ్, అలీ అన్వర్ కు మరో వారం రోజులు గడువు లభించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహాకూటమితో పొత్తు తెంచుకుని…ఎన్డీఏతో జతకట్టడాన్ని జేడీయూ నేతలు శరద్ యాదవ్, అలీ అన్వర్ వ్యతిరేకించారు. దీంతో పార్టీ నిర్ణయాన్ని గౌరవించని ఆ ఇద్దరి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని జేడీయూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి ఫిర్యాదుచేసింది.
దీనిపై స్పందించేందుకు తొలుత రాజ్యసభ సచివాలయం ఆ ఇద్దరు నేతలకు వారం రోజులు గడువు విధించింది. సోమవారంతో ఆ గడువు ముగిసింది. పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నందున నెల రోజుల సమయం కావాలని, శరద్ యాదవ్, అలీ అన్వర్ విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనను పరిశీలించిన రాజ్యసభ సచివాలయం అదనంగా మరో వారం గడువు ఇస్తున్నామని, ఈలోగా సభ్యత్వం రద్దు అంశంపై నోటీసులకు సమాధానం ఇవ్వాలని స్ఫష్టం చేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి మహాకూటమి ఏర్పాటుచేసి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన జేడీయూ…తర్వాత ఆ పొత్తును తెగతెంపులు చేసుకుంది. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో తలెత్తిన పరిణామాలు మహాకూటమి విచ్ఛిన్నానికి దారితీశాయి.
నాటకీయ పరిణామాల మధ్య బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నితీశ్ కుమార్ పార్టీలో వ్యతిరేకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నవారందరినీ దూరం పెడుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న కొన్నిరోజులకే జేడీయూలో రాజ్యసభ పక్షనేతగా ఉన్న శరద్ యాదవ్ ను నితీశ్ కుమార్ తొలగించారు. తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకూ చర్యలు తీసుకుంటున్నారు. మహాకూటమితో తెగతెంపులు చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న శరద్ యాదవ్ గత నెలలో పాట్నాలో బీజేపీకి వ్యతిరేకంగా లాలూ ప్రసాద్ యాదవ్ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. దీంతో జేడీయూలో చీలిక అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.