Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన హామీల అమలు కోసం పోరాడేందుకు ఓ వేదిక ఏర్పాటుచేసే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో దీనిపై స్పందించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే టీడీపీ దానికి ఒప్పుకుందని, అయినప్పటికీ ప్యాకేజీని కేంద్రం ఎందుకు అమలుచేయలేదో ఏపీ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న అంశాలను విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, విభజన హామీలకు సంబంధించి సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.
ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యావేత్తలు, సామాజిక, రాజకీయ నాయకులు తదితరులతో జేఎఫ్ సీ ఏర్పాటుచేయాలని అన్నారు. ఏ వ్యక్తిగత, రాజకీయ స్వార్థం, వివక్ష లేకుండా జేఎఫ్ సీ ఏపీ పునర్విభజన హామీలను విశ్లేషించి నివేదిక అందిస్తుందని తెలిపారు. అలాగే జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని, జేఎఫ్ సీ అందించిన నివేదిక ప్రకారం జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ రాజకీయ కార్యాచరణ రూపొందిస్తుందని పవన్ ట్వీట్ చేశారు. పవన్ కు ఇప్పటికే లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మద్దతు పలికారు. మరికొందరు భావసారూప్యత కలిగిన నేతలతో కలిసి తెలుగు రాష్ట్రాల తరపున పోరాడాలని జేపీ, పవన్ నిర్ణయించుకున్నారు.