బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు షాకిచ్చింది. ఆయన చేసిన బెయిల్ పొడగింపు అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తోసిపుచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు కుదరదన్న కోర్టు అగస్టు 30లోగా ఆయన న్యాయస్థానం ముందు లొంగిపోవాలని ఆదేశించింది. దాణా కుంభకోణం కేసులో గత ఏడాది డిసెంబర్‌లో లాలూ దోషిగా తేల్చినా ఆయన అప్పటి నుంచి మెడికల్ బెయిల్ పై బయటే ఉన్నారు. ఆ స్కామ్‌తో పాటు ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో మరో రెండు కేసుల్లోనూ ఆయన దోషిగా తేలారు. అందుకు గాను న్యాయస్థానం ఆయనకు 14ఏళ్ల జైలు శిక్ష విధించింది.
అనారోగ్య కారణాల వల్ల బెయిల్ కావాలని లాలూ వేసిన బెయిల్ పొడగింపు పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. లాలూ తరుపున ఆయన న్యాయవాది మను సింఘ్వి కోర్టులో వాదనలు వినిపించారు. లాలూకు మరో మూడు నెలల పాటు బెయిల్ పొడగించాల్సిందిగా అప్రేశ్ కుమార్ నేత్రుత్వంలోని బెంచ్‌ను ఆయన కోరారు. అయితే న్యాయమూర్తి మాత్రం మూడు నెలలు కాదని ఈ నెలాఖరులోగా కోర్టు ఎదుట లాలూ హాజరుకావాలని తీర్పునిచ్చారు. ప్రస్తుతం లాలూ ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనను కుమారుడు తేజస్వి ఇటీవలే పరామర్శించి లాలూ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.