ఏపీ రాజకీయాలు రోజు రోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల్లోకి వలసలు ఊపందుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ నుంచి ప్రతిపక్షం వైసీపీలోకి నేతలు జంప్ చేస్తున్నారు. ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటూ నియోజవర్గ స్థాయి నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు జగన్‌ను కలవడం రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ఈరోజు ఉదయం నార్నె శ్రీనివాసరావు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి వెళ్లారట. కొద్దిసేపు ప్రతిపక్ష నేతతో సమావేశమయ్యారు అనంతరం బయటకు వెళుతుండగా మీడియా ఎదురుపడి ఎందుకు వచ్చారని ప్రశ్నించిదట. అయితే మర్యాద పూర్వకంగానే కలిశానని బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారట.
మర్యాదపూర్వకంగానే కలిశానని నార్నె చెప్పినా ఈ భేటీ మీద రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. జంపింగ్ ల సీజన్ కావడం ఇప్పుడు జగన్ ను శ్రీనివాసరావు కలవడంతో ఆయన కూడా వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలయ్యింది. నిజానికి నార్నె శ్రీనివాసరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దగ్గర బంధువు. నార్నె కూతురు లక్ష్మీ ప్రణతిని జూ.ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కుదిర్చించి కూడా చంద్రబాబేనని అప్పట్లో వార్తలొచ్చాయి. అంతేకాదు నార్నె గతంలో స్టూడియో ఎన్ ఛానల్‌ను కూడా నడిపారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఆయన రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి ఆయన ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా ప్రచారానికి ఆయన్ని జగన్ వాడతారా ? అనేది ఆసక్తికరంగా మారింది.