15 ఏళ్ళల్లో దేశంలో 400 మందికి ఉరిశిక్ష

15 ఏళ్ళల్లో దేశంలో 400 మందికి ఉరిశిక్ష

నిర్భయ అత్యాచార దోషులకు ఢిల్లీ హై కోర్టు ఉరిశిక్ష విధించిన తర్వాత ఇదే విషయమై దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్భయ దోషులకు శిక్షలు పడాలని అప్పట్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసిన యువత ముఖ్యంగా మహిళలు, యువతులు ఢిల్లీ కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారికి శిక్షలు పడాల్సిందే. దాన్ని ఎవరూ కాదనటం లేదు. అయితే పడిన శిక్షలు ఎంతమందికి అమలవుతున్నాయి ?

ఇపుడిదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నేషనల్ రీసెర్చి క్రైం బ్యూరో (ఎన్సిబిఆర్) లెక్కల ప్రకారం గడచిన 15 ఏళ్ళల్లో దేశంలోని వివిధ కోర్టులు 400 మందికి ఉరిశిక్షను విధించాయి. అయితే ఇందులో ఎంతమందికి ఉరిశిక్ష అమలైందో తెలుసా ? కేవలం ఒక్కశాతం మాత్రమే. అంటే 400 మందికి ఉరిశిక్ష పడితే అమలైంది మాత్రం కేవలం నలుగురి విషయంలో మాత్రమే అంటే వినటానికే ఆశ్చర్యంగా ఉంటుంది.

కోర్టులు నేరస్తులకు ఉరిశిక్షలు విధించినా ఎందుకు అమలు కావటం లేదు ? ఎందుకంటే ఉరిశిక్షలు విదించిన తర్వాత కూడా దోషులకు పై కోర్టుల్లో అప్పీలు చేసుకునే అవకాశం ఉండటం, అక్కడ ఉరిశిక్ష విధించకుండా స్టేలు వస్తుండటం, రాష్ట్రపతికి క్షమాబిక్షకు దరఖాస్తు చేసుకోవటం, ఆ దరఖాస్తులు రాష్ట్రపతి పరిశీలనలో ఉండటం… ఇలా అనేక కారణాలతో చాలా వరకూ పెండింగులోనే ఉంటున్నాయి.

ఈ విషయం ఇలాగుంటే ఇప్పట వరకూ విధించిన మొత్తం ఉరిశిక్షల్లో రాష్ట్రపతి క్షమాబిక్ష తర్వాతనో లేకపోతే పై కోర్టుల్లో ఉరిశిక్షను కొట్టేయటం లాంటి వాటి వల్ల కనీసం 1200 మందికి ఉరిశిక్ష కాస్త యావజ్జీవిత కారాగార శిక్షగా మారిపోయాయని బ్యూరో లెక్కలు చెబుతోంది. నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించిన నేపధ్యంలో బ్యూరో గణాంకాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంతకీ ఉరిశిక్ష పడిన నలుగురు ఎవరో తెలుసా ? ఎవరంటే పశ్చిమబెంగాల్లో ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినందుకు ధనుంజయ్. రెండో వ్యక్తి పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్. ఇక మూడో వ్యక్తి మన పార్లమెంటు మీద దాడికి కుట్రపన్నిన అఫ్జల్ గురు. చివరగా నాలుగో వ్యక్తి ఎవరంటే 1993 ముంబాయ్ బాంబు పేలుళ్ళ సూత్రదారి యాకూబ్ మెమన్. ఇపుడు గనుక నిర్భయ దోషులకు గనుక ఉరిశిక్ష అమలైతే ఈ సంఖ్య ఎనిమిదికి చేరుతుంది. ఎలాగంటే ఒకేసారి నలుగురికీ ఉరిశిక్ష విధించటం దేశంలో ఇదే మొదటిసారి.