Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గురుగ్రామ్ లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న హత్యకేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకేసులో నిందితుణ్ని పెద్దవాడిగానే పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. మిగతా సాధారణ ఖైదీల్లానే అతడిని కూడా కోర్టులో హాజరుపర్చాలని, శుక్రవారం న్యాయస్థానానికి తీసుకురావాలని సూచించింది. కేసులో నిందితుడి నేరం రుజువై శిక్ష పడితే 21ఏళ్లు వచ్చేవరకు అతను జువైనల్ హోంలో ఉంటాడని, ఆ తర్వాత సాధారణ జైలుకు తరలించాలని స్పష్టంచేసింది. ఏడేళ్ల ప్రద్యుమ్న ఈ ఏడాది సెప్టెంబరు 8న రేయాన్ స్కూల్ లో దారుణంగా హత్యకు గురయ్యాడు.
స్కూల్ టాయిలెట్ లోనుంచి రక్తమోడుతూ బయటకి వచ్చిన ప్రద్యుమ్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బస్సు కండక్టర్ అశోక్ కుమార్ ప్రద్యుమ్నపై లైంగిక దాడికి ప్రయత్నించి హతమార్చాడని స్థానిక పోలీసులు కేసు నమోదుచేశారు. అశోక్ కుమార్ ను అరెస్టు చేసి విచారిచంగా అతను నేరాన్ని అంగీకరించాడు. అయితే పోలీసుల కథనంపై ప్రద్యుమ్న తండ్రి సహా అనేకమందిలో అనుమానాలు రేకెత్తాయి. బస్సు కండక్టర్ స్కూల్ టాయిలెట్ లోకి వచ్చి మరీ హత్య చేశాడన్నది నమ్మశక్యంగా అనిపించకపోవడంతో ప్రద్యుమ్న తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. హత్య జరిగిన నెలరోజుల తర్వాత కేసు విచారణ చేపట్టిన సీబీఐకి నిర్ఘాంతపోయే నిజం తెలిసింది.
ప్రద్యుమ్నను హత్యచేసింది బస్సు కండక్టర్ కాదని, అదే స్కూల్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి అని దర్యాప్తులో తేలింది. పరీక్ష వాయిదా వేసేందుకే నిందితుడు ప్రద్యుమ్నను హత్యచేశాడని గుర్తించిన సీబీఐ పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు మైనర్ కావడంతో అతణ్ని జువైనల్ గా పరిగణించి విచారణ చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా ప్రద్యుమ్న తండ్రి జువైనల్ బోర్డును ఆశ్రయించారు. నిందితుణ్ని వయోజనుడిగా పరిగణించాలని కోరారు. ప్రద్యుమ్న తండ్రి వాదనను జువైనల్ బోర్డు అంగీకరించింది. ఎగువ మధ్యతరగతి, సంపన్నవర్గాల పిల్లల్లో పెరుగుతున్న నేరప్రవృత్తికి ప్రద్యుమ్న హత్య ఓ ఉదాహరణగా భావిస్తున్నారు. పరీక్ష వాయిదా పడడంకోసం ప్రణాళిక ప్రకారం ఓ విద్యార్థిని చంపిన నిందితుణ్ని చూసి పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోయారు.