ప్రియుడి చేతిలో చనిపోయిన జ్యోతి కుటుంబంలో మరో విషాదం !

Jyothis Father Died Saturday

పెళ్లి చేసుకోమని ప్రియుణ్ని నిలదీసి, అతడి చేతిలో దారుణ హత్యకు గురైన జ్యోతి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి అంగడి గోవింద్‌ గుండెపోటుతో కన్నుమూశారు. కుమార్తె హత్య విషయం తెలిసిన తర్వాత ఆయన తీవ్రంగా కలత చెందారు. జ్యోతి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన జరిగిన రోజే గోవింద్‌‌కు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందిన ఆయన మంగళవారం మృతి చెందారు. ఇటీవల జరిగిన జ్యోతి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ప్రియుడైన శ్రీనివాస్ ఆమెను కడతేర్చాడు.

తాడేపల్లి మహానాడుకు చెందిన చుంచు శ్రీనివాసరావు (26), అంగడి జ్యోతి (24) రెండేళ్లపాటు ప్రేమించుకున్నారు. మనస్పర్ధల కారణంగా కొన్ని నెలల పాటు శ్రీనివాసరావుకు దూరంగా ఉన్న జ్యోతి ఇటీవలే మళ్లీ దగ్గరైంది. ప్రేమ పేరుతో జ్యోతిని శారీరకంగా వాడుకున్న శ్రీనివాస్ పెళ్లి ప్రస్తావన వస్తే దాటేసేవాడు. దీంతో పెళ్లి చేసుకోమని బాధితురాలు నిలదీసింది. ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టంలేని శ్రీనివాస్ జ్యోతిని నమ్మించి కిరాతకంగా హత్య చేశాడు. జ్యోతిని హత్యచేసి తెలివిగా తమపై ఎవరో దాడి చేశారని కట్టుకథ అల్లాడు. నవులూరు స్టేడియం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఏకాంతంగా ఉండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో తమపై దాడికి పాల్పడ్డారని శ్రీనివాసరావు చెప్పాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతి అక్కడిక్కడే మరణించింది. గాయాలపాలైన అతణ్ని హాస్పిటల్లో చేర్చి చికిత్స అందించారు. పలు కోణాల్లో కేసును విచారించిన పోలీసులు శ్రీనివాసరావే నిందితుడని తేల్చారు.