కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సాంకేతిక లోపంతో ఆగి ఉన్న హంద్రీ ఎక్స్ ప్రెస్ రైలును లింగంపల్లి నుండి ఫలక్ నామా వెళుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ తో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వెళ్లిన రైల్వే అధికారులు, పోలీసులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఎంఎంటీఎస్ ట్రైన్ వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ఎంఎంటీఎస్ రైలు ఐదు బోగీలు, ఎక్స్ ప్రెస్ రైలు మూడు బోగీలు రెండు ట్రాక్ లపై పడిపోయాయి. క్యాబిన్ లో చిక్కుకున్న లోకో పైలట్ ను రక్షించడానికి రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తోంది. కాచిగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాచిగూడ వద్ద జరిగిన ప్రమాదం దురదృష్టకరమని అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తలసాని శ్రీనివాస్ సహాయక చర్యలు వేగంగా జరిగేలా చూడాలని అన్నారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం బీబీ సింగ్ సిగ్నల్ లోపం వలనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
ఈ ఘటన జరిగిన సమయంలో రైళ్లలో దాదాపు 600 మంది ప్రయాణికులు ఉన్నారని బీబీ సింగ్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని ఏజీఎం బీబీ సింగ్ తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు మరలా జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని బీబీ సింగ్ తెలిపారు. ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయినట్లు సమాచారం అందుతోంది.