Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా ఉన్నంత కాలం నిలిచిపోయే మహానటి సావిత్రి గురించి… మహానటి సినిమా తర్వాత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ తరం వాళ్లకు సావిత్రిని మహానటి మరోసారి పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో పలువురు సావిత్రితో తమకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకుంటున్నారు. ఈ కోవలోనే ప్రముఖ నటుడు కమల్ హాసన్ సావిత్రి జీవితంలోని ఎత్తుపల్లాల గురించి ప్రస్తావించారు. బాలనటుడిగా సావిత్రి గారితో కలిసి చాలా సినిమాల్లో నటించానని కమల్ చెప్పారు. ఆమె తనను ఓ దత్త పుత్రుడిలా ఎంతో ప్రేమగా చూసుకునేదని, ఆమె వైభవం చూస్తూ తాను పెరిగానని తెలిపారు.
సావిత్రిగారికి ఇష్టమైన కిళ్లీ కట్టించుకురావడానికి ఇంపాలా కార్లు వెళ్లేవని, అలాంటి సావిత్రిగారు ఆ తర్వాతి రోజుల్లో టాక్సీ కోసం రోడ్డు పక్కన వెయిట్ చేస్తుండడం చూశానని కమల్ ఆవేదనగా చెప్పారు. సావిత్రి గారి బంగ్లా తనకు తెలుసని, అది ఓ ప్యాలెస్ లా ఉండేదని తెలిపారు. తాను నిర్మాతగా మారిన తర్వాత సావిత్రి గారిని కలవాలనుకున్నానని, తన మేనేజర్ ఆ బంగ్లాకు కాకుండా ఓ చిన్న గదికి తీసుకెళ్లాడని కమల్ చెప్పారు. ప్యాలెస్ లాంటి ఇంటిలో మహరాణిలా జీవించిన సావిత్రి ఆ చిన్నగదిలో ఉండడం చూసి తట్టుకోలేకపోయానని, కన్నీళ్లు ఆపుకోలేకపోయానని కమల్ భావోద్వేగానికి గురయ్యారు.