ప్రముఖ సంఘ సంస్కర్త, కులవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు పెరియార్ విగ్రహం కూల్చివేతపై మక్కళ్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. కావేరీ నిర్వహణా బోర్టు ఏర్పాటు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఈ పనిచేస్తున్నారని కమల్ ట్విట్టర్ లో ఆరోపించారు. పెరియార్ విగ్రహాలను పరిరక్షించేందుకు పోలీసులను నియమించాల్సిన అవసరం లేదని, వాటిని తాము కాపాడుకోగలమని కమల్ ట్వీట్ చేశారు. పెరియార్ విగ్రహాలను ఎలా కాపాడుకోవాలో తమిళులకు తెలుసన్నారు.
త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని, తమిళనాడులోని వెల్లూరులో పెరియార్ విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్పందించిన ప్రధాని విగ్రహాల వద్ద బందోబస్తుకు ఆదేశించారు. అటు విగ్రహాల ధ్వంసంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో ప్రశ్నించారు. తొలుత లెనిన్ విగ్రహాన్ని, ఆపై పెరియార్ విగ్రహాన్ని, అనంతరం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, విధ్వంసకారుల ఎజెండా ఏమిటని ఆయన ప్రశ్నించారు. మన చిన్నారులకు ఏం చెప్పదలుచుకున్నారని, దయచేసి ఈ విగ్రహాల రాజకీయాన్ని ఆపాలని చేతులెత్తి కోరుతున్నానని అన్నారు. హింసామార్గంలో వెళ్తే… మరింత హింస చూడాల్సిఉంటుందని, మీ ఎన్నికల మ్యానిఫెస్టో గూండాయిజాన్ని పెంచి పోషించడమా…? లేక అభివృద్ధా అని ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.