Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పరిస్థితులని బట్టి, అవసరాలను బట్టి ఆలోచనలు, అభిప్రాయాలు మారిపోతుంటాయి. ఒకప్పుడు మనకు అద్భుతంగా అనిపించిన విషయమే తర్వాతి రోజుల్లో పెద్ద తప్పుగా కనిపించే సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు కమల్ హాసన్ అదే పరిస్థితిలో ఉన్నారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నానని ఇటీవలే ప్రకటించిన కమల్ హాసన్… గతంలోని తన అభిప్రాయాలను సమీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు తనకు అద్భుతంగా అనిపించిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఒకటి ఇప్పుడుమాత్రం చాలా తప్పుడు చర్యగా అనిపిస్తోంది. అదే డీమానిటైజేషన్. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించగానే…నరేంద్రమోడీపై అనేకమంది విమర్శలు కురిపించారు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ నిర్ణయాన్ని హర్షించారు. వారిలో కమల్ హాసన్ ఒకరు. ఈ నిర్ణయం తీసుకున్నమోడీకి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. అయితే అప్పట్లో తాను పెద్ద నోట్ల రద్దుకుమద్దతు తెలపడంపై కమల్ ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తొందరపడి మద్దతు తెలిపినందుకు తనను క్షమించాలని దేశ ప్రజల్ని, అభిమానుల్ని కోరారు. ఈ మేరకు తమిళ మేగజైన్ కు ఆయన ఓ ఆర్టికల్ రాశారు. అప్పట్లో అందరిలానే తానూ..ఇది దేశ భవిష్యత్ కు ఉపయోగపడే నిర్ణయమని భావించానని, కానీ పెద్ద నోట్ల రద్దుతో సమాజంలో ఏర్పడిన సమస్యలు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నాయని కమల్ వ్యాఖ్యానించారు. డీమానిటైజేషన్ తో దేశప్రజలంతా రోడ్డున పడ్డారని, కొందరి మేలుకోసమే నరేంద్రమోడీ ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో లాభపడింది పెద్దలు మాత్రమే అని, పేదలు తమ జీవితాల్ని కోల్పోవాల్సి వచ్చిందని, ఆ నిర్ణయం ద్వారా తలెత్తే పరిణామాలను అప్పట్లో తాను ఊహించలేకపోయానని కమల్ వివరించారు. తెలియక తాను పెద్ద నోట్ల రద్దుకు మద్దతిచ్చినందుకు క్షమాపణ కోరుతున్నాను అని ఆర్టికల్ లో రాశారు.
నోట్ల రద్దుతో నల్లధనం తొలగిపోతుందని తాను అనుకున్నానని, కానీ అది జరగలేదని, ఈ విషయాన్ని మోడీ ఒప్పుకుంటే మరోసారి సలాం కొడతానని కమల్ చెప్పారు. నవంబరులో కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన కమల్ …తన రాజకీయ ఎజెండా ఏమిటో మోడీపై విమర్శల ద్వారా వెల్లడించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన కొత్త పార్టీ బీజేపీకి వ్యతిరేకమే అన్న సంకేతాలను ప్రజల్లోకి పంపడానికే కమల్ ఈ విమర్శలు చేశారని భావిస్తున్నారు. నిజానికి బీజేపీతో ఎలాంటి సంబంధాలు మెయిన్ టెయిన్ చేయాలనే దానిపై కమల్ కు ఇంకా ఓ క్లారిటీ లేదు. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన తరువాత నా రంగు కాషాయం కాదంటూ…బీజేపీకి వ్యతిరేకమని సంకేతాలు ఇచ్చిన కమల్ కొన్ని రోజుల తరువాత…అవసరమైతే బీజేపీతో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధం అని ప్రకటించి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మళ్లీ ప్రధానిపై విమర్శలు చేయడం ద్వారా బీజేపీకి వ్యతిరేకం అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ జెండా, ఎజెండా ప్రకటించిన తర్వాతే… కమల్ అసలు దారి ఎటు అన్నది తేలనుంది.