Kamal Hassan Cleared Route for Rajanikanth
తమిళ రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్ధం కాకుండా వుంది. అధికార, విపక్షాల్లోనే కాదు కొత్తగా వచ్చే పార్టీల గురించి కూడా అయోమయం కొనసాగుతూనే వుంది. రజని కొత్త పార్టీ ఏర్పాటు ఖాయమని అందరూ ఆనుకుంటున్న సమయంలో కమల్ ఇబ్బడిముబ్బడిగా రాజకీయ ప్రకటనలు గుప్పించేసారు. దీంతో కమల్ కూడా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇంకేముంది…అసలే తమిళేతరుడు అనే సమస్య ఎదుర్కొంటున్న రజని ఈ వార్తలతో కాస్త కంగారు పడ్డారు. కమల్ కూడా కొత్త పార్టీ పడితే ఎదురయ్యే పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని కాస్త సంయమనం పాటించాడు. దీంతో రజని పార్టీ ఏర్పాటు ప్రకటన ఆలస్యం అయ్యింది. అయితే తాజాగా కమల్ కామెంట్స్ తో రజని రాజకీయ రంగ ప్రవేశానికి రూట్ క్లియర్ అయ్యింది.
జయలలిత మరణం తర్వాత ప్రతి రాజకీయ ఘటన మీద చురుగ్గా స్పందించిన కమల్ తమిళనాట కొత్త చర్చకు తెర లేపాడు. ఈ ప్రకటనలతో కమల్ కి రాజకీయ అభిలాష మెండుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే అలాంటిదేమీ లేదని కమల్ క్లారిటీ ఇచ్చాడు. రాజకీయాల తీరుతెన్నులు మారాలని ఓ సామాన్యుడిగా కోరుకుంటున్నానే తప్ప రాజకీయాల్లోకి లాగొద్దని కమల్ పత్రికా ముఖంగా వేడుకున్నాడు. దీంతో కమల్ ఇక పాలిటిక్స్ లోకి రాదన్న స్పష్టత వచ్చింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే రజని రాజకీయ రంగప్రవేశానికి రూట్ క్లియర్ అయ్యింది.