Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమాలకు, రాజకీయాలకు ఉన్న బంధం ఈ నాటిదికాదు..వెండితెర వేల్పులుగా వెలుగొంది…ఆ ఇమేజ్ తో రాజకీయాల్లో ప్రవేశించి అనుకున్న లక్ష్యాలను సాధించిన సినీనటులు మనదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అదే సమయంలో అసలు లక్ష్యాల సంగతి పక్కనపెడితే..సొంత నియోజకవర్గాల్లో గెలవలేని నటులూ ఉన్నారు. ఆయా నటుల గెలుపోటములకు గల కారణాలను విశ్లేషించడం చాలా కష్టం. స్థానిక పరిస్థితులు, ప్రజల ఆలోచనలు, పార్టీ ప్రణాళికలు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. సినిమా అనేది అనేకమంది వ్యక్తుల సమష్టి కృషి అయినప్పటికీ… ఒక హీరో ఛరిష్మాతో ఆ చిత్రం ఘనవిజయం సాధించవచ్చు. కానీ అదే రాజకీయాలకు వచ్చే సరికి ఈ ఈక్వేషన్ మారిపోతుంది. ఓ వ్యక్తికి ఉండే ఇమేజ్ తో ఎన్నికలు గట్టెక్కడం అసాధ్యం. ఎంత ప్రజాదారణ ఉన్నా… కోట్లాది అభిమానులు ఉన్నా…అవేవీ ఎన్నికల్లో గెలుపును ఖరారుచేయవు. అందుకే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అన్న అభిప్రాయం తరచూ వ్యక్తమవుతుంటుంది. సినిమా ద్వారా వచ్చే ఇమేజ్ రాజకీయాల్లోకి ప్రవేశం కల్పించే ద్వారంలాంటిది మాత్రమే. సినీతారగా వచ్చే పేరు ప్రఖ్యాతులు ఆ ద్వారంలోకి సులభంగా ప్రవేశించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. వేదిక మీద ఇవ్వాల్సిన ప్రదర్శన కోసం మూలాల నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టాల్సిందే. అందుకే శివాజీ గణేశన్ గురించి మాట్లాడే సందర్భంలో రజనీకాంత్ సినిమా తారల రాజకీయ ప్రవేశం గురించి ఓ వ్యాఖ్య చేశారు.
నటుడిగా ఉన్నతస్థానంలో ఉన్నప్పుడే శివాజీ గణేశన్ కొత్త పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీచేశారని, కానీ… సొంత నియోజకవర్గంలో కూడా గెలుపొందలేకపోయారని, ఇది ఆయనకు జరిగిన అవమానం కాదని, నియోజకవర్గ ప్రజలకు జరిగిన అవమానంగా భావించాలని రజనీకాంత్ విశ్లేషించారు. రాజకీయాల్లో శివాజీ గణేశన్ గొప్ప పాఠాలు నేర్పించి వెళ్లారని, తన ఓటమి ద్వారా సినీ నటులకు ఓ నీతిని బోధించారని, రాజకీయాల్లో గెలుపొందాలంటే సినిమా ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు మాత్రమే చాలవని, దీనికి మించినశక్తి కావాలని రజనీకాంత్ అన్నారు. అవును రజనీ చెప్పింది నిజమే.
సినిమా ఇమేజ్ తో ప్రజలతో ఓట్లు వేయించుకోవడం కష్టం. దానికి మించిన శక్తి ఏదో తెలుసుకుంటేనే రాజకీయాల్లో రాణించగలరు. సినీ నేపథ్యంతో ఎన్నికల్లో గెలిచిన వారంతా… ఆ శక్తి ఏంటో తెలుసుకున్నారని, ఓడిపోయినవారు తెలుసుకోలేకపోయారనే అనుకోవాలి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన నటులంతా ఎన్నికల్లో గెలుస్తామా, ఓడిపోతామా అన్నదానిపై ఓ అంచనాకి రాకుండానే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ క్రమంలో కొందరిని అదృష్టం వరిస్తే… మరికొందరని దురుదృష్టం పలకరించింది. ఓడిపోయిన వారి నుంచి గుణపాఠాలు ఎందరు నేర్చుకున్నారో తెలియదు కానీ… గెలిచిన వారి జీవితం మాత్రం సినీరంగంలో మరికొందరిని రాజకీయాల వైపుకు ఆకర్షిస్తోంది. మరి కొత్తగా పాలిటిక్స్ లోకి అడుగుపెడుతున్నవారిలో అనుకున్న లక్ష్యాలను చేరుకునేదెందరో…?
ప్రస్తుతం దక్షిణ భారతంలో సినీ, రాజకీయాల మేళవింపు జరుగుతోంది. ఎమ్జీఆర్, ఎన్టీఆర్, విజయ్ కాంత్, చిరంజీవిల తరం తరువాత… మరికొందరు ఉరిమే ఉత్సాహంతో రాజకీయ కార్యక్షేత్రంలోకి దూకుతున్నారు. ఇంకొందరు రాజకీయ ప్రవేశానికి వీలుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలో అందరికన్నాముందు వరుసలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత ఎన్నికల సమయంలోనే రాజకీయాల్లో ప్రవేశించిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు జనసేనను
క్రియాశీలకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నిజానికి 2019 ఎన్నికల నాటికి జనసేన ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయపార్టీగా ఎదుగుతుందని అంతా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల కన్నా..సినిమాలపైనే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. ఏ నాయకుడైనా..పార్టీని బలోపేతం చేయాలంటే విస్తృతంగా జనంలో తిరగాలి. కానీ పవన్ ట్విట్టర్ లో మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు.దీంతో ఆయన ట్విట్టర్ వేదికగా జనసేనను నడుపుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణపై ఇంకా స్పష్టత లేదు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తారా లేక ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా అన్నదానిపై పవన్ కళ్యాణ్ మనసులో మాట వెల్లడించడం లేదు. అయితే ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంత ఉంటుంది అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంతంగా పోటీచేస్తే…పవన్ కళ్యాణ్ పార్టీ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలుపొందలేదని, ఏపార్టీతోనైనా పొత్తుపెట్టుకుంటేనే జనసేన లాభపడుతుందని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. పవన్ చెప్పిన మాటను తుచ తప్పకుండా వారు ఆచరిస్తారు. కానీ రాజకీయాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పవన్ అభిమానులు ఎంతమంది ఆయన వెంట నడుస్తారో చూడాలి. ఎందుకంటే..పవన్ కళ్యాణ్ కు మించి పేరు ప్రఖ్యాతులు ఉన్న చిరంజీవికి…రాజకీయాల్లో ఘోరవైఫల్యం ఎదురయింది. సొంత నియోజకవర్గం పాలకొల్లులోనే ఆయన ఓడిపోయారు.
పవన్ ఇమేజ్… దానికి భిన్నం అనుకున్నప్పటికీ… అభిమానం ఓట్లరూపంలోకి మారుతుందా అన్నది సందేహమే. అసలు పవన్ తన రాజకీయ లక్ష్యమేమిటన్నది కూడా ఇప్పటిదాకా వెల్లడించలేదు. జనసేనను సొంతంగా అధికారంలోకి తెచ్చి సీఎం అవడమా… లేక.. ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకుని అధికారంలో భాగస్వామ్యం కావడమా అన్నదానిపై పవన్ కళ్యాణ్ కే క్లారిటీ ఉన్నట్టు కనిపించడంలేదు. ఇలా డోలాయమానంలో కొట్టాడుతున్న జనసేనాని వచ్చే ఎన్నికలను ఏ మేరకు ప్రభావితం చేస్తారో చూడాలి. ఇక తమిళనాడు విషయానికొస్తే… ఆ రాష్ట్రంలో రాజకీయాలది, సినిమాలది విడదీయలేని బంధం. తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినిమాల ద్వారా రాజకీయాల్లో ఎదిగిన వారే. ఇప్పుడూ అదే విధంగా విశ్వనటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తమిళ నాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలు కంటున్నారు. మరో యువ హీరో విజయ్ కూడా వారి బాటలోనే సాగేట్టు కనిపిస్తున్నాడు. దశాబ్దాలుగా ఉన్న సస్పెన్స్ ను కొనసాగిస్తూ… తన రాజకీయ ప్రవేశంపై రజనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
అయితే ఎవరూ ఊహించని రీతిలో తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యక్షమయ్యారు విశ్వనటుడు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ… అవే లోకంకా ఉండే కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రం ప్రకటన అందరికీ షాక్ కలిగించేదే. త్వరలోనే కొత్త రాజకీయపార్టీతో తమిళ ప్రజల ముందుకువస్తున్నారు కమల్. ఇప్పటికే రాష్ట్రమంతా కలియదిరుగుతూ… రాజకీయజీవితానికి పునాదులు వేసుకుంటున్నారు. రాజకీయాల్లో సమూలంగా మార్పులు తేవడమే తన లక్ష్యమని కమల్ ప్రకటిస్తున్నప్పటికీ… ఆయన అసలు లక్ష్యం ఏమిటో అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో విజయం సాధించి ముఖ్యమంత్రి కావాలన్నది కమల్ హాసన్ ఉద్దేశం. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని పాలిటిక్స్ లో ఎదగాలని కమల్ భావిస్తున్నారు. రజనీలా నాన్చుడు ధోరణి కాకుండా…స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు కమల్. అయితే తన మనస్తత్వం దృష్ట్యా ఆయన రాజకీయాల్లో ఇమడలేడని కొందరు వాదిస్తున్నారు. ముక్కుసూటిగా ఉండే కమల్ హాసన్ పాలిటిక్స్ కు పనికిరారన్నది వారి ఉద్దేశం. మరి ఆయన అనుకున్న లక్ష్యాలను సాధిస్తారా లేక… విజయ్ కాంత్ లా మిగిలిపోతారా అన్నది కాలమే చెప్పాలి.
రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పాల్సి వస్తే… ఇప్పటికీ రజనీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆయనే అన్నట్టు రాజకీయాల్లో గెలుపునిచ్చే శక్తి ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటూ జరిగితే… ముఖ్యమంత్రి అయితీరాలన్నది రజనీ ఉద్దేశం. అలా కాకుండా రాజకీయాల్లో… ఓటమిని ఎదుర్కోవడం ఆయనకు ఇష్టం లేదు. తాను ఓ శివాజీ గణేశన్, విజయ్ కాంత్, చిరంజీవి అయ్యేందుకు రజనీ సిద్ధంగా లేరు. అదే సమయంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ అవ్వడం ఎలానో తెలియడం లేదు. అందుకే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలా… వద్దా అని అంతగా ఆలోచిస్తున్నారు.
ఇక తమిళనాడుకే చెందిన మరో హీరో విజయ్. రజనీకాంత్ తర్వాత తమిళ సినిమాల్లో ఆ స్థాయి ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి పదేళ్లగా చర్చ నడుస్తోంది. కానీ దానిపై ఆయన క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా… మెర్సెల్ సినిమా వివాదం నేపథ్యంలో మళ్లీ దీనిపై చర్చ మొదలయింది. అయితే ఈ సారి విజయ్ పాలిటిక్స్ లోని ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. సామాజిక సమస్యలను ఇతివృత్తంగా చేసుకున్న సినిమాల్లో వరుసగా నటిస్తుండడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయడం కోసం విజయ్ సన్నాహాలు చేస్తున్నారని, అభిమానుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేశారన్నవార్తలు వినిపిస్తున్నాయి.మెర్సెల్ సినిమా వివాదంలో బీజేపీ వైఖరి చూసిన తరువాత… విజయ్ రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం తీసేసుకున్నారని తెలుస్తోంది. అయితే కమల్ హాసన్ మాత్రం పాలిటిక్స్ లోకి రావొద్దని విజయ్ కు సలహాఇస్తున్నారు.
మరో దక్షిణాది రాష్ట్రం కర్నాటకలో కూడా సినీనేపథ్యంతో రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పటిదాకా ఆ రాష్ట్రంలో నటులు వివిధ పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీచేశారు కానీ… కొత్తగా పార్టీ పెట్టినవారు లేరు. కానీ ఉపేంద్ర ఆ సాహసం చేశారు. తన సినిమాలతో తెలుగువారికి కూడా బాగా దగ్గరైన ఉపేంద్ర కర్నాటకలో రాజకీయ భవిష్యత్ ను పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. పొరుగురాష్ట్రాల తరహాలో కర్నాటకలోనూ రాజకీయాలను మార్చాలని భావిస్తున్నారు. బెంగళూరులోని గాంధీ భవన్ లో కర్నాటక ప్రజావంత జనతాపక్షపేరుతో పార్టీని ప్రకటించారు. సమాజంలో మార్పు రావాలని కోరుకునే ఎవరైనా తన పార్టీలో ఉచిత సభ్యత్వం తీసుకోవచ్చని తెలిపారు. మరింత మెరుగైన సమాజాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని చెప్పారు. రాజకీయరంగంలో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందని, దాన్ని అంతంచేయడానికి శాయశక్తులా పోరాటం చేస్తామని తెలిపారు. ఖాకీ షర్టు ధరించి ఉపేంద్ర పార్టీ ఎనౌన్స్ చేయడం ద్వారా తమ పార్టీ కార్మికులపక్షపాతి అని చెప్పే ప్రయత్నం చేశారు. ఉపేంద్రతో పాటు ఆయన భార్య ప్రియాంక, ఇతర నాయకులు కూడా ఖాకీ దుస్తులే ధరించారు. రాజకీయాల్లో సినిమాల ప్రభావం అంతగా లేని కర్నాటకలో ఉపేంద్ర పార్టీ ఎలాంటి పాత్ర పోషించనుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..మొత్తంగా చూస్తే దక్షిణాదిన ఇప్పుడు రాజకీయాల్లో సినీపాలిటిక్స్ అనే కొత్త శకం ప్రారంభంకాబోతుంది. రాజకీయ నేపథ్యం కన్నా సినిమా నేపథ్యం భవిష్యత్తులో పాలిటిక్స్ ను శాసించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.