ఏపీలో మద్యం రేట్లు బీభత్సంగా పెంచడంతో మందుబాబుల చూపులు పక్కకు మరలుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ రాయదుర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండి హులికుంటప్ప కుమారుడు విక్రమ్ కుమార్ అలియాస్ విక్కీ, కర్ణాటక నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ లోకి భారీ ఎత్తున మద్యం తరలిస్తూ.. పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. కానీ ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది అంటే.. గత నెల 30న ‘కేఏ 34 ఏ 5856’ నంబర్ గల టాటా ఏసీ వాహనంలో 624 కర్ణాటక మద్యం బాటిళ్లతో విక్రమ్ ఏపీలోకి వస్తున్నాడు. ఆ సమయంలో రాయదుర్గంలోని మొలకాల్మూరు రోడ్డులో గల ఎక్సైజ్ చెక్‌పోస్టులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ధనుంజయ వాటిని చెక్ చేయడంతో పట్టుబడ్డారు. దీంతో విక్రమ్ తో పాటు వాహన యజమాని మహమ్మద్ అన్సర్, ఆసిఫ్, విశాల్ రాజ్ మహార్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు వివరించారు.