Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక శాసనసభ ఎన్నికలకు మూడు రోజులుకి వచ్చేయడంతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు గెలుపు కోసం తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఎన్నిక దగ్గర పడ్డాక బెంగళూరులో వేలకొద్దీ నకిలీ ఓటరు కార్డులు బయటపడటం కన్నడ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రభుత్వ అధికారులతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇంటర్నెట్ సాయంతో వేలాది కొత్త ఓటర్లను చేర్పిస్తోన్న ఒక గ్యాంగ్ ని నిన్న అర్థరాత్రి ఎన్నికల అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంజీవ్‌కుమార్ ఎమెర్జన్సీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్నీ ప్రకటించారు.
బెంగళూరు వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 6.03 శాతం కొత్త ఓటర్లు నమోదవగా, రాజరాజేశ్వరినగర్‌లో మాత్రం అది 10.3 శాతం ఎక్కువగా ఉండడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టడంలో గుట్టు బయటపడింది. రాజరాజేశ్వరీనగర్ తాలూకా జలహళ్లిలోని ఎస్‌ఎల్వీ అపార్ట్‌మెంట్‌లో చట్టవిరుద్దంగా నిర్వహిస్తోన్న కొత్త ఓటర్ల నమోదు నకిలీ కేంద్రం బయటపడింది. ప్రభుత్వ, అధికార వర్గాలకు తెలియకుండా రహస్యంగా సేకరించిన సాఫ్ట్వేర్ కోడ్ సాయంతో కొత్త ఓటర్లను జాబితాలోకి ప్రవేశపెట్టి నకిలీ కార్డులను సృష్టిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న అధికారులు దాడుల చేయడంతో సంబందిత ప్రాంతాల్లో 9,756 కార్డులు బయటపడ్డాయి.
మరో లక్ష ఓటరు గుర్తింపు కార్డులను తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన పత్రాలను సైతం వారు అక్కడ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల తయారీకి వినియోగిస్తున్న ఐదు ల్యాప్‌ట్యాప్‌లు, ఓ ప్రింటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతుందా, లేక దానిని ఆపివేసి వోట్ల ని వెరిఫై చేయాలా అనేది 24 గంటల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇదే కేంద్రంలో ఓ ఎమ్మెల్యే ఫోటోలు కూడా లభించినట్లు సమాచారం.
ఈ విషయం గురించి తెలుసుకున్న కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు అక్కడకు చేరుకుని, ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకోవడం విశేషం. జేడీఎస్ వ్యవస్థాపకుడు హెచ్.డి.దేవేగౌడ సహా పలువురు నేతలు, కార్యకర్తలు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే ఈ నకిలీ ఓటర్ కార్డుల వెనుక హస్తం పార్టీ అభ్యర్ధి హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు నుండి బీజేపీ లో ఉన్న ఆయన కిందటి ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఈ నియోజకవర్గంలో తక్షణమే ఎన్నిక నిలిపివేయాలని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి లేఖలు వ్రాసినట్టు తెలుస్తోంది.