Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావత్ విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజ్ పుత్ ల ఆందోళనలు తీవ్ర రూపు దాల్చుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు పద్మావత్ పై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేయడంపై రాజ్ పుత్ కర్ణిసేన భగ్గుమంటోంది. ఈ సినిమా విడుదల చేస్తే దర్శకుడు ఆత్మాహుతికి పాల్పడాలని అప్పుడు ఆయన చితికి తామే నిప్పెడతామని రాజ్ పుత్ వర్గానికి చెందిన మహిళలు హెచ్చరిస్తున్నారు. ఈ సినిమా విడుదల చేస్తే ఊరుకోబోమన్నారు. సినిమా విడుదల వాయిదా పడకముందూ రాజ్ పుత్ మహిళలు పద్మావత్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. పద్మావత్ విడుదల చేస్తే జౌహర్ కు పాల్పడతామని అప్పట్లో హెచ్చరించిన రాజ్ పుత్ స్త్రీలు ఇప్పుడు దర్శకుడి చితికి నిప్పెడతామని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే ఈ ఆందోళనలకు పద్మావత్ యూనిట్ పట్టించుకోవడం లేదు. సెన్సార్ బోర్డు అనుమతి, సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. అటు వివాదాల సంగతి పక్కనపెడితే ప్రేక్షకులంతా పద్మావత్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్తోర్ రాణి పద్మిణి జీవితకథ ఆధారంగా తెరకెక్కడంతో పాటు తాజా వివాదాలు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కథ తెలిసినదే అయినప్పటికీ భారీ చిత్రాలను తనదైన స్టయిల్ లో తీర్చిదిద్దే భన్సాలీ పద్మావత్ ను ఎలా మలిచారో చూడాలని ప్రేక్షకులంతా యాంగ్జయిటీతో ఉన్నారు. సినిమా ట్రైలర్ కు, పాటలకు విశేష స్పందన రావడమే ఇందుకు నిదర్శనం. పద్మావత్ పై రాజ్ పుత్ ల నిరసనల ప్రభావం ఏమాత్రం కనిపించబోదని… బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.