Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ మధ్య కాలంలో పద్మావత్ పై జరిగినట్టుగా ఏ సినిమాపైనా చర్చ జరగలేదు. పద్మావత్ పై తలెత్తిన వివాదంతో ఆ సినిమా మనదేశంలోనే కాదు… ప్రపంచవ్యాప్తంగానూ హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం రాజ్ పుత్ ల ఆందోళనలే. చిత్తోర్ రాణి పద్మిణి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన పద్మావత్ నిర్మాణ దశ నుంచే వివాదాలు ఎదుర్కొంది. రాజ్ పుత్ ల గౌరవానికి చిహ్నంగా భావించే పద్మిణిపై పద్మావత్ లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, జీవితంలో ఒక్కసారి కూడా కలుసుకోని ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, రాణి పద్మిణిలపై ప్రేమ సన్నివేశాలు తెరకెక్కించారని ఆరోపిస్తూ… సినిమా విడుదలకు ముందు రాజ్ పుత్ కర్ణిసేన ఆందోళనలు ప్రారంభించింది. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆందోళనలు ఉధృతరూపు దాల్చాయి. కొందరు రాజ్ పుత్ మద్దతుదారులు ఒక అడుగు ముందుకు వేసి భన్సాలీ, దీపిక తలలకు వెల కూడా కట్టారు.
ఈ ఆందోళనల నేపథ్యంలో సీబీఎఫ్ సీ అనుమతి నిరాకరణతో డిసెంబర్ 1 విడుదల కావాల్సిన పద్మావతి వాయిదా పడింది. దీంతో ఆందోళనలు ఆగిపోయాయి. తర్వాత సెన్సార్ బోర్డు సూచనల మేరకు పద్మావతి… పద్మావత్ గా పేరు మార్చుకుని… మరికొన్ని మార్పులు, చేర్పులు చేసుకుని జనవరి 25న రిలీజ్ కు సిద్ధమయింది. రాజ్ పుత్ లు మళ్లీ ఆందోళన మొదలుపెట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని సినిమాపై నిషేధం విధించాయి. దీన్ని వ్యతిరేకిస్తూ పద్మావత్ యూనిట్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలకు అక్షింతలు వేసి నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే విడుదలకు ఒక్కరోజు ముందు సుప్రీంకోర్టు తీర్పును సైతం పట్టించుకోకుండా రాజ్ పుత్ కర్ణిసేన విధ్వంసకాండకు దిగింది. రహదారుల దిగ్బంధం, ప్రభుత్వ వాహనాలు తగులబెట్టడం వంటి హింసాత్మకచర్యలకు పాల్పడడంతో పాటు గుర్గావ్ లో ఓ స్కూల్ బస్సుపై కర్ణిసేన కార్యకర్తలు దాడిచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కర్ణిసేన ఆందోళనల నేపథ్యంలో నాలుగురాష్ట్రాల్లో సినిమా విడుదలకు నోచుకోలేదు.
కర్ణిసేన విధ్వంసకాండను మనదేశంతో పాటు ప్రపంచ దేశాల పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. ఇది సినిమా విడుదలకు ముందు పరిస్థితి. పద్మావత్ రిలీజ్ తర్వాత పరిణామాలు మారిపోయాయి. సినిమాలో రాజ్ పుత్ లను అగౌరవపరిచే సన్నివేశాలు ఏమీ లేకపోవడంతో పాటు… రాజ్ పుత్ ల పరాక్రమాన్ని అవసరానికి మించి ఎక్కువగా పొగిడారన్న భావన ప్రేక్షకులకు కలిగింది. దీంతో కర్ణిసేన ఆందోళనలు అర్థంలేనివిగా భావించారు దేశ ప్రజలు. ఈ నేపథ్యంలో సినిమా వీక్షించిన కర్ణిసేన మనసు మార్చుకుంది. స్కూల్ బస్సుపై దాడిచేయడం వంటి ఆందోళనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయినా వెనక్కితగ్గని కర్ణిసేన పద్మావత్ విడుదలైన దాదాపు 10 రోజుల తర్వాత శాంతించింది. ఈ సినిమాపై ఇకమీదట ఆందోళనలు చేయబోమని ప్రకటించింది. తాజాగా కర్ణిసేనకు చెందిన కొందరు ప్రముఖులు పద్మావత్ వీక్షించడంతో సినిమాపై వారికున్న అపోహలు తొలగిపోయాయి.
కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ సూచన మేరకు ముంబైలో కర్ణిసేన నేతలు కొందరు సినిమా చూశారు. అనంతరం వారు పద్మావత్ పై పొగడ్తలు కురిపించడం విశేషం. సినిమాలో రాజ్ పుత్ ల శౌర్యాన్ని గొప్పగా ప్రశంసించారని, సినిమా తమ గౌరవాన్ని మరింత పెంచేలా ఉందని శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన ముంబై నాయకుడు యోగేంద్ర సింగ్ కటార్ వెల్లడించారు. ప్రతి రాజ్ పుత్ పద్మావత్ చూసి గర్వపడతారని అన్నారు. సినిమాపై గతంలో ప్రచారం జరిగినట్టుగా ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, రాణి పద్మిణిల మధ్య అభ్యంతరకర సన్నివేశాలేమీలేవని యోగేంద్ర సింగ్ స్పష్టంచేశారు. ఇకపై కర్ణిసేన సినిమాపై ఎలాంటి ఆందోళనలు చేపట్టదని వెల్లడించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ తో పాటు దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శనకు సహకరిస్తామని ప్రకటించారు.