ఎన్నికల వేళ కాంగ్రెస్ కి పెద్ద షాకే తగిలింది. కాంగ్రెస్ పార్టీకీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి రాజీనామా చేశారు. రాజేంద్రనగర్ నుండి పోటీ చేసేందుకు కార్తీక్ రెడ్డి ప్రయత్నించారు. మహా కూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ సీటు టీడీపీకి దక్కింది. దీంతో రాజేంద్రనగర్ నుండి గణేష్‌గుప్తాను టీడీపీ తన అభ్యర్ధిగా బరిలోకి దింపింది. దీంతో రాజేంద్రనగర్ టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా కార్తీక్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీట్ల సర్దుబాటుపై 40 రోజులుగా కాంగ్రెస్ తర్జన భర్జలు పడుతోంది. అయితే కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే టెక్కెట్ ఇవ్వాలనే నిబంధనలు కొంతమేరకు సడలించి కొంతమందికి ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ రోజు గురువారం ఉదయం తన అనుచరులతో కార్తీక్ రెడ్డి సమావేశమయ్యారు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పంపారు. తన రాజీనామా ఆమోదిస్తారో.. లేదా రాజేంద్రనగర్ సీటు ఇస్తారో తేల్చుకోవాలని కోరారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధికి ఎవరితో ఓట్లేసి గెలిపిస్తారో గెలిపించుకోవాలని సవాల్ చేశారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజీనామా చేస్తారని చెప్పారు. మహాకూటమి పేరుతో ఎల్. రమణ టిక్కెట్లు అమ్ముకున్నారంటూ కార్తీక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో కార్తీక్ రెడ్డి చెవెళ్ల లోక్ సభకు పోటీ చేశారు. కార్తీక్ రెడ్డి తల్లి సబితా ఇంద్రారెడ్డి గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ఈ సారి కుటుంబానికి ఒకే టిక్కెట్ అనే నిబంధన ఉండదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కార్తీక్ రెడ్డి కొన్నేళ్లుగా రాజేంద్రనగర్ నియోజక వర్గంపై దృష్టి సారించారు. పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా ఆ నియోజక వర్గాన్ని టీడీపీ కేటాయించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయన నిన్ననే రాజేంద్రనగర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా బరిలోకి దిగబోతున్నారా ? లేక మరేదైనా పార్టీ నుండి రంగంలోకి దిగుతున్నారా ? అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తుందనే అంశం ఉత్కంఠగా మారింది.