తమిళనాడు మాజీ సీఎం, దివంగత కరుణానిధి పూర్వీకులు తెలుగువారేనన్న సంగతి రెండ్రోజుల నుండీ టీవీలు మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిది ఒంగోలు ప్రాంతమని తెలుస్తోంది. ఇదే విషయాన్నీ కరుణ స్వయంగా చెప్పారట. దాదాపు 60 ఏళ్ల క్రితం అంటే, కరుణానిధి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో 1960లో ఏలూరులో డిటెక్టివ్ నవలా రచయితల సమావేశం జరిగింది. అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు వచ్చిన కరుణానిధి, అక్కడ తనకు పరిచయమైన డిటెక్టివ్ నవలా రచయిత, ఒంగోలుకు చెందిన కొంపల్లి బాలకృష్ణకు తమ పూర్వీకుల వివరాలు చెప్పారట.
పదహారేళ్ల వయసులోనే నవలలు రాసి గుర్తింపు తెచ్చుకున్న కొంపల్లికి ఈ సభకు ఆహ్వానం అందడంతో వెళ్లారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తనను తాను పరిచయం చేసుకుని, ఒంగోలు నుంచి వచ్చానని కరుణకు చెప్పారు. దీంతో ఆప్యాయంగా మాట్లాడిన కళైంజ్ఞర్.. ‘ఒంగోలా… అయితే నువ్వు మా వాడివే. ఒంగోలు ఎలా ఉంది? మాది కూడా ఆ ఊరే. మా ముత్తాత పెళ్లూరు సంస్థానంలో విద్వాంసులుగా పని చేశారు. పరిస్థితులు తారుమారు కావడంతో మద్రాసుకు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డాం’ అని తెలియజేశారు. అనంతరం బాలకృష్ణ ఆ విషయం అందరికీ తెలిపారు. తర్వాత తర్వాత కరుణ తన పూర్వీకుల గురించి మాట్లాడిన సందర్భాలు బహుఅరుదు. అయితే, బాలకృష్ణ మాత్రం తన సన్నిహితుల వద్ద, భార్య అరుణ వద్ద ఈ విషయాన్ని ఎన్నోమార్లు చెప్పారు. నాలుగేళ్ల క్రితం బాలకృష్ణ మరణించారు. కరుణానిధి కూడా ఇప్పుడు దివంగతులయ్యారు. ఇప్పుడు కరుణ మరణం సందర్భంగా ఈ విషయం మరో సరి గుర్తు చేసుకుంటున్నారు కోపల్లి సన్నిహితులు.