కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు మెరీనా బీచ్‌లోని అన్నా మెమోరియల్ వద్ద స్థలం కావాలంటూ కరుణ కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరగా అక్కడ అనుమతి ఇవ్వలేమని, కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, శాంతిభద్రతల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని చెబుతూ ప్రభుత్వం చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న రాత్రి కరుణ కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లారు. కొద్దిసేపటి క్రితం మద్రాస్ హైకోర్టు అంత్యక్రియల మీద కీలక నిర్ణయం తీసుకుంది. బీచ్ లో అంత్యక్రియలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లన్నింటినీ కోర్టు కొట్టివేసింది. బీచ్ లో అంత్యక్రియలకు అభ్యంతరం లేదన్న పిటిషన్ దారుల నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పింది.
దీంతో మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై వాదనలు సాగుతుండగా, కాసేపట్లో కోర్టు తుది తీర్పు వెలువడనుంది. కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ ప్రాంతంలో ఇదే విషయాన్ని మైకుల ద్వారా కార్యకర్తలకు చెప్పడంతో వారిలో ఆనందం పెల్లుబికింది. కరుణానిధి కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, కాబట్టి మెరీనా బీచ్‌లో అంత్యక్రియలపై వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు న్యాయవాది దొరైస్వామి తెలిపారు. తాము పిటిషన్ ఉపసంహరించుకుంటే ప్రభుత్వానికి న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని, కాబట్టి కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోనే నిర్వహించవచ్చని ఆయన కోరి అలానే చేయడంతో మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలకు మార్గం సుగమమైంది. నేటి సాయంత్రం మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు జరుగుతాయి.