Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్నిరోజులనుంచి మౌనంగా ఉన్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్ పండుగ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ పైనా, ఆయన అభిమానులపైనా ధ్వజమెత్తాడు. అభిమానులను పవన్ రెచ్చగొడుతున్నాడని, ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికి రాడని మండిపడ్డాడు. పవన్ లాంటి వ్యక్తిపై ప్రజాస్వామ్యయుతంగానే పోరాడాలని, అలాగే ఓడించాలని, ఆయనపై స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీచేస్తానని స్పష్టంచేశాడు. పవన్ ఫ్యాన్స్ బానిస మనస్తత్వంతో బతుకుతున్నారని, నాలుగు నెలలుగా తాను తన వ్యక్తిత్వం కోసం, హక్కుల కోసం, అస్తిత్వం కోసం పోరాడుతోంటే వాళ్లకు అర్ధం కావడం లేదని అసహనం వ్యక్తంచేశాడు. తాను ఎప్పుడూ పవన్ ను వ్యక్తిగతంగా తిట్టలేదని, ఆయన అభిమానులు మాత్రం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ఆరోపించాడు.
ప్రజాస్వామ్య దేశంలో తన భావాన్ని నిర్భయంగా వ్యక్తపరిచే హక్కు తనకు ఉందని, పవన్ అభిమానులు ఆ హక్కును కాలరాసేలా బెదిరిస్తున్నారని, తన ప్రతి కదలిక మీదే కాకుండా తన కుటుంబ సభ్యులపై కూడా కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశాడు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్… ఇలా మనం ఎవరి గురించైనా మాట్లాడొచ్చు కానీ… పవన్ గురించి మాట్లాడితే మాత్రం దాడిచేస్తారని… అంటే పవన్ అంత గొప్పోడా అని ప్రశ్నించాడు. ప్రజాస్వామ్యానికి ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నాడు. ఈ వివాదం ఆగాలంటే తననే ఓ మెట్టు దిగాలని నీతులు చెబుతున్నారని, ఇటువంటి అభిమానులు ఉంటే జనసేన నాశనం అవుతుందని హెచ్చరించాడు. పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని తాను క్షమాపణలు చెప్పాలని అంటున్నారని, తాను కనుక రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షక సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు తనవైపు ఉంటాయని, అప్పుడు పవన్ తన కాళ్ల వద్దకు రావాల్సి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
తాను ఇప్పటికే ఒక మెట్టు దిగానని, మొదట పవన్ వచ్చి తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశానని, అనంతరం ఆయన ఒక ట్వీట్ చేస్తే చాలన్నానని అయినా… పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఆగ్రహం వ్యక్తంచేశాడు. తన వల్ల కలిగిన అసౌకర్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబే ఓ సామాన్యుడికి క్షమాపణలు చెప్పారని, సీఎం కంటే పవన్ గొప్పోడు కాదని, మరి ఆయన ఎందుకు క్షమాపణ చెప్పడం లేదని కత్తి మహేశ్ ప్రశ్నించాడు. పవన్ ఫ్యాన్స్ తో జరుగుతున్న వివాదం తన ప్రాథమిక హక్కులకు సంబంధించిందని, అందుకే దీనిని విడిచిపెట్టడం లేదని కత్తి స్పష్టంచేశాడు. పవన్ పై తాను చేసిన ఆరోపణలన్నింటికీ ఆధారాలు ఉన్నాయని, పవన్ అడిగితే వాటిని చూపించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశాడు. పవన్ అభిమానుల వైఖరి మారకపోతే రేపటి నుంచి మళ్లీ ఆయనపై కౌంటర్లు వేస్తానని కత్తిమహేశ్ హెచ్చరించాడు.