Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణలో కొత్త జోనల్ విధానాన్ని ఖరారుచేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర ఆవిర్భావంతో పాటు కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిన నేపథ్యంలో జోనల్ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునర్విభజించాలని కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం ఏడు జోన్లు, 2 మల్టీజోన్లు ఏర్పాటు చేస్తున్నారు. 28.29లక్షల జనాభాతో కాళేశ్వరం జోన్ ఏర్పాటుచేస్తున్నారు. భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి ఈ జోన్ కింద ఉంటాయి. 39.74లక్షల జనాభాతో ఏర్పాటయ్యే బాసర జోన్ కిందకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల వస్తాయి. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ ఉండే రాజన్న జోన్ లో 43.09లక్షల జనాభా ఉంటుంది. భద్రాద్రి జోన్ కిందకు కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ వస్తాయి.
ఈ జోన్ జనాభా 50.44 లక్షలు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ ఉండే యాదాద్రి జోన్ లో 45.23లక్షల జనాభా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి తో ఏర్పాటయ్యే చార్మినార్ జోన్ లో 1.03 కోట్ల జనాభా ఉంటాయి. 44.63లక్షల జనాభాతో జోగులాంబ జోన్ ఏర్పాటు కానుంది. ఈ జోన్ లో మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్ ఉంటాయి. ఇక మల్లీజోన్ల విషయానికొస్తే… 1.61కోట్ల జనాభాతో కాళేశ్వరం, బాసర, రాజన్న భద్రాద్రి, మల్టీజోన్ -1లో, 1.88 కోట్ల జనాభాతో యాదాద్రి, చార్మినార్, జోగులాంబ ప్రాంతాలు ఉంటాయి. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా… గతంలో జరిగిన అన్యాయం పునరావృతం కాకుండా జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు, ఐఏఎస్ అధికారుల కమిటీ కసరత్తు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ నేతృత్వంలోని సంప్రదింపుల కమిటీ వెల్లడించిన అభిప్రాయాల ఆధారంగా ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి జోనల్ వ్యవస్థ ఖరారుచేశారు.