కేసీఆర్ సీఎం అయ్యాక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ లో భూకుంభకోణాలు బట్టబయలయ్యాయి. మియాపూర్ స్కామ్ తో మొదలైన ల్యాండ్ మాఫియా.. కూకట్ పల్లి, బాలానగర్, ఇంకా నగరంలోని చాలా ప్రాంతాలకు పాకింది. ఈ దెబ్బతో కేసీఆర్ పనైపోయిందని విపక్షాలు పండగ చేసుకున్నాయి. మరోవైపు రాష్ట్రానికి కీలకమైన రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోతుందని నేతలూ భయపడ్డారు.
కానీ డ్రగ్స్ కేసు వారందరికీ ఊరట ఇచ్చింది. ఏకంగా ఆరుగురు సబ్ రిజిస్ట్రార్ల అరెస్టుతో తెలంగాణలో కలకలం రేగింది. ముందు జాగ్రత్తగా ఏధో ఒకటి చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సీఎం పేషీపై ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో డ్రగ్స్ కేసు బయటపడటంతో.. తెలంగాణ ప్రభుత్వానికి అయాచిత వరం దక్కింది. ప్రభుత్వ పెద్దలంతా ఒక్కటై ఆ కేసు ఫోకస్ అయ్యేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ వ్యూహంలో భాగంగానే సీఎం అకున్ సభర్వాల్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, కేసు మూలాల్లోకి వెళ్లండని సూచించారని తెలుస్తోంది. ఎన్నికల వరకూ ఇలాగే కొనసాగిస్తే.. పార్టీకి తిరుగుండదని నేతలు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారట. అంటే ల్యాండ్ స్కామ్ ను విజయవంతంగా పక్కదారి పట్టిచ్చినట్లే. మీడియా కూడా ప్రభుత్వ వలలో పడిపోయి డ్రగ్స్ కేసు హైలైట్ చేస్తూ.. స్కాములు మరిచిపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.