కారెక్కేసిన వంటేరు…!

KCR Opponent Vanteru Pratap Reddy To Join TRS

గజ్వేల్ అభివృద్ధి కోసమే తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఈ రోజు తెలంగాణ భవన్ లో ఆయన కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఒంటేరుకు కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. పార్టీలోకి రావాలని గతంలో మూడు సార్లు కేటీఆర్‌ కోరారని గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరి ఉంటే ఎంతో బాగుండేదని ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యానించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలైన వేములఘట్, మల్లన్నసాగర్ ప్రాంతంలోని రైతులు కూడా కేసీఆర్ కు ఓటేశారని ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల్లో గెలవాలనే పోరాటం చేశా తప్ప కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. కేటీఆర్ కూడా తాను 2009లోనే ఒంటేరు ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించానని కాని ఆయన పదేళ్లకు పార్టీలో చేరారన్నారు. గజ్వేల్ ప్రజలు అదృష్టవంతులని ఆ నియోజకవర్గానికి నిధుల వరద పారుతోందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో కూడా వదల కుండా చంద్రబాబు పై విమర్శలు చేశారు కేటీఆర్. కేసీఆర్‌ను ఓడించాలనే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. వంటేరు ప్రతాప్ రెడ్డి చేరిక కార్యక్రమానికి ఆయన అనుచరులే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇతర టీఆర్ఎస్ నేతలు పెద్దగా కనిపించలేదు. నిన్న వంటేరు పార్టీలో చేరడం లేదని ప్రకటించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఇద్దరూ మాట్లాడుకోలేదు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జ్ గా కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహరించినప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ విబేధాలు పెరిగాయన్న ప్రచారం ఉంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యవహారాలను కనుసన్నల్లో నడిపే హరీష్ రావు కూడా ఎక్కడా కనిపించలేదు. ఆయనకు కనీస సమాచారం కూడా పంపలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వంటేరు టీఆర్ ఎస్ లో చేరినా ఒంటరే అని అంటున్నారు.