తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో వైసీపీ లేదా జనసేనకు కేసీఆర్ సాయం చేస్తారని వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా దీన్ని బలపరిచేలా ఓ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చంద్రబాబుకు కేసీఆర్ నుంచి ఆ కానుక అందడంలో ఆలస్యమవుతుందని భావించారో లేకపోతే అత్యుత్సాహంతో చేశారో గాని చిత్తూరు జిల్లాలో వైకాపా కార్యకర్తలు కొందరు ప్రజలకు రిటర్న్ గిఫ్ట్‌లు పంచేశారు. కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతల ఫొటోలతో గోడ గడియారాలను పంచేశారు. దీంతో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.
త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో వైసీపీ నేతలు గోడ గడియారాలను పంచారు. ఇందులో వైఎస్ రాజశేఖరరెుడ్డి, వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఫొటోలు ఉన్నాయి. అయితే గడియారం లోపల ఇంకో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించిన స్థానికులు దాన్ని తొలగించి చూసి షాక్ తిన్నారు. కింది స్టిక్కరుపైన కేసీఆర్, పెద్దపల్లి టీఆర్ఎస్ నేత దాసరి మనోహర్ ఫొటోలు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ ఇప్పటికే చంద్రబాబు సొంత జిల్లాలో రిటర్న్ గిఫ్టుల పంపణీ మొదలు పెట్టిందని పార్టీ నేతల అంటున్నారు.