Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీకి, ప్రభుత్వానికి నూతనోత్తేజం, దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పును ప్రారంభించడం లక్ష్యాలతో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఉత్సాహంగా సాగుతోంది. టీఆర్ ఎస్ కు ఇది 17వ ప్లీనరీ కాగా… కొత్త రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత నాలుగోది. ప్లీనరీ వేదికకు తెలంగాణ ప్రగతి వేదికగా నామకరణం చేశారు.
పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్లీనరీకి తరలివచ్చారు. రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా…సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ ప్లీనరీని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్లీనరీలో ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. టీఆర్ ఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ అన్నారు. పార్టీ స్థాపించిన సమయంలో ఎన్నో హేళనలు, అవమానాలు ఎదుర్కొన్నామని, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. ఒంటరిగా వెళ్లి ఎన్నికల పోరులో విజయం సాధించామన్నారు. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు. టీఆర్ఎస్ పాలనపై ప్రధాని, పలువురు సీఎంలనుంచి ప్రశంసలు వచ్చాయని, టీఆర్ ఎస్ పథకాలను మాజీ ప్రధాని దేవెగౌడ అభినందించారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటుచేసినట్టు వివరించారు.
ఏడుదశాబ్దాలపాటు ప్రజలను పీక్కుతున్న పార్టీ కాంగ్రెసని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫలయత్నం చేయాలని కుట్ర పన్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శమని నీతిఅయోగ్ చెప్పిందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశరాజకీయాలపైనా కేసీఆర్ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలుచేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీల అసమర్థ పాలన, దద్దమ్మ చర్యల వల్లే నీటియుద్దాలు వస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జలసమస్యలపై ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫెడరల్ ఫ్రంట్ తో దేశవ్యాప్తంగా రైతులకు న్యాయంచేస్తామని తెలిపారు. దేశంలో 70వేల టీఎంసీల నీరుందని, సాగుభూమి 40 కోట్ల ఎకరాలు మాత్రమేనని, 40వేల టీఎంసీలతో ప్రతి ఎకరాకు నీటిని ఇవ్వొచ్చని కేసీఆర్ చెప్పారు.
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించే బాధ్యతను ప్రజలు అప్పగించారని అన్నారు. దేశరాజకీయాలపై తాను చేసిన ప్రకటనతో ప్రకంపనలు పుట్టాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ తనపై విమర్శలు చేస్తున్నాయని, ఆ పార్టీలకు కేసీఆర్ అంటే ఎందుకంత భయమని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకంచేసి గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుడతానని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగానే భూకంపం పుట్టిస్తానని, రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకొస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించారు.