తెలంగాణలో ఉన్నవి 17 సీట్లు అందులో ఒకటి ఒవైసీకి మరో 16 లో తలకిందులు తపస్సు చేసినా గెలిచేవి 10-12 సీట్లు. చంద్రబాబుతో సఖ్యంగా ఉన్న వారిని చెడగొట్టే ప్రయత్నం మినహా ఎటువంటి మూడో ఫ్రంట్ ఉద్దేశం లేనట్టుంది కేసీఆర్ కి. ఇది అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో మీడియా వాళ్లు, రాజకీయ నాయకులు ఆస్తులు పోతాయని భయపడతారు గాని ఇతర రాష్ట్రాల నేతలు ఎందుకు భయపడతారు? అందుకే మొహం మీద చెప్పేశారు. ఫెడరల్ ఫ్రంట్ అజెండాను కేసీఆర్ వివరించినా అంతా విన్న స్టాలిన్ ఏ మాత్రం సానుకూలంగా స్పందించలేదని ప్రచారం జరుగుతోంది. డీఎంకే వర్గాల సమాచారం మేరకు అంటూ మీడియాలో రిపోర్టులు వస్తున్నాయి. దానిని బలపరిచినట్లే… స్టాలిన్ ప్రెస్మీట్ పెట్టకపోవడం కూడా గమనార్హం. ఒకవేళ జాతీయంగా ఏదైనా పాత్ర పోషించదలచుకుంటే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలని స్టాలిన్ సలహా ఇచ్చారట. మోడీ రాడు కాంగ్రెస్ కు కేసీఆర్ అంటే మంట. ఇపుడు ఆ ఛాన్స్ కూడా లేదాయె. అయితే మొన్నే అప్పాయింట్ మెంట్ నో అంటే మళ్లీ బతిమాలి తెచ్చుకున్నది కాబట్టి తన ఫెడరల్ ఫ్రంట్ అంటే కోపం వస్తుందేమో స్టాలిన్ కి అని కేసీఆర్ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. దేశంలోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోటీ చేశాయనీ అందువల్ల ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఫెడరల్ ఫ్రంట్ గా ఏర్పాటయ్యేందుకు డీఎంకే నాయకత్వం వహించాలని కేసీఆర్ తన సందేశాన్ని మార్చి చెప్పారట. అదంతా జరగదని కొట్టి పారేసిన స్టాలిన్ “కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తీసుకురావడమే మా లక్ష్యం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా డీఎంకేనే ప్రపోజ్ చేసింది కాబట్టి కాంగ్రెస్ నుంచి మేం విడిపోలేం. వీలుంటే మీరూ కాంగ్రెస్ తో జతకలవండి” అంటూ మొహంపై చెప్పేశారట. అందుకే ప్రెస్ మీట్ కు కూడా స్టాలిన్ నిరాకరించారు.