Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోక్ సభలో టీడీపీ, వైసీపీ ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డు పడుతున్నది రెండే రెండు పార్టీలు. అందులో ఒకటి కావేరి బోర్డు ఏర్పాటుకి డిమాండ్ చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులు అయితే ఇంకొకరు రేజర్వేషన్ల వ్యవహారంలో పట్టుబడుతున్న తెరాస. ఈ రెండు పార్టీల సభ్యులు వెల్ లోకి దూసుకెళుతూ పరోక్షంగా బీజేపీ కి ఉపయోగపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రత్యేక హోదా డిమాండ్ కి మద్దతు అంటూనే తెరాస ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో చాలా మందికి అర్ధం కావడం లేదు. అయితే దీని వెనుక ఎన్నికల పొత్తుల వ్యవహారం దాగివున్నట్టు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో తెలంగాణాలో ఎన్నికల పొత్తుతో ముందుకు వెళతామని టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్యే స్పష్టం చేశారు. ఆయన ఈ ప్రకటన తెరాస ని దృష్టిలో పెట్టుకుని చేశారా లేక కాంగ్రెస్ ని దృష్టిలో ఉంచుకుని చేశారా అన్నది బయటకు తెలియదు. అయితే రేవంత్ చొరవతో టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వస్తున్న వార్తలు తెరాస ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ కి 15 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్ సభ స్థానం ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకుందని కూడా తెరాస నమ్ముతోందట. అయితే టీడీపీ 25 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలు కావాలని డిమాండ్ చేస్తోందట. సెటిలర్స్ తో పాటు టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కి వెళితే జరిగే నష్టాన్ని అంచనా వేసుకుని తెరాస లోక్ సభలో అవిశ్వాసం విషయంలో చంద్రబాబుకి ఝలక్ ఇస్తున్నట్టు సమాచారం.