కేసీఆర్ టార్గెట్ టీడీపీనే…ఎందుకంటే…?

Kcr Target On Tdp Party

ఎక్కడైనా 93 పెద్దదా లేక 14 పెద్దదా అంటే ఎవరైనా ఏమని చెబుతారు. ఎవర్ని అడిగినా 14 అనే చెబుతారు. కానీ టీఆర్ఎస్ చీఫ్ మాత్రం పెద్ద సంఖ్యను వదిలి చిన్న సంఖ్య మీద దృష్టి పెట్టారు. 93 ను కాదంటూ 14 ను టార్గెట్ చేశారు. వాస్తు, సంఖ్యాశాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ ఇక్కడ కూడా న్యూమరాలజీ లాంటిది ఏమైందా ఫాలో అవుతున్నారా ? అని పించక మానదు. అసలు ఈ 14, 93 కధ ఏమిటి అంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్ఎస్ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదనుకుంటోంది. ఛాన్స్ దొరికితే చాలు టీడీపీనే టార్గెట్ చేస్తోంది. మహాకూటమిలో భాగంగా 119 స్థానాలకు గాను అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం కంటే కూడా కేవలం 14 స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీని గులాబీదండు టార్గెట్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కీలకంగా మారింది.

KCR Fair on Chandrababu

వాస్తవానికి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణాని అభివృద్ధి చేసుకోడం కంటే టీడీపీని బలహీన పరచడానికే కేసీఆర్ సర్కార్ పాటు పడిందనే చెప్పొచ్చు. టీడీపీ క్యాడర్ చాలామటుకు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అంతో ఇంతో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మాత్రం టీఆర్ఎస్ లెక్కల్లోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్ తమకు ఏరకంగా పోటీ కాదనే విషయాన్ని పలు సందర్భాల్లో గులాబీనేతలు వ్యాఖ్యానిస్తుండటం అదే సమయంలో టీడీపీని టార్గెట్ చేయడం చూస్తుంటే టీఆర్ఎస్ స్ట్రాటజీ ఇట్టే అర్థమవుతుంది. రాష్ట్రంలో ఎన్నో పార్టీలున్నా కూడా టీఆర్ఎస్ మాత్రం తన ప్రధాన ప్రత్యర్థిగా టీడీపీని చూడటం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. తాజాగా టీడీపీపై గులాబీ బాస్ కేసీఆర్ చేసిన కామెంట్లు చర్చానీయాంశంగా మారాయి. 14 స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీకి కాంగ్రెస్ శ్రేణులు సహకరించవని కుండబద్దలు కొట్టారు కేసీఆర్. అంతేకాదు టీడీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా టీడీపీ అనుసరించిన వైఖరిని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

అలాంటిది ఇప్పుడు ఎలక్షన్ల సమయంలో టీడీపీ తీసుకున్న స్టాండ్ గులాబీ లీడర్లకు మరింత కోపం తెప్పిస్తోంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా టీడీపీ అధిష్టానంపై విరుచుకుపడుతున్నారు. అదేక్రమంలో టీడీపీని టార్గెట్ చేస్తూ ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కూడా టీడీపీ టార్గెట్ గానే మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ ను ఓడించడం ఎవరితరం కాదని బలం లేకనే టీడీపీ పొత్తులబాట పట్టిందని విమర్శిస్తున్నారు. తెలంగాణలో టీడీపీకి అసలు ఓటు బ్యాంకు లేదని ప్రచారం చేస్తున్నారు. సైద్దాంతిక విభేదాలు పక్కనబెట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమే గాకుండా టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారనేది గులాబీదండు వాదన. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి సంచులకొద్దీ డబ్బులు పంపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగాన్ని బాగా వాడుకోవడం తెలిసిన చంద్రబాబు మొన్నటికి మొన్న జగిత్యాల జిల్లా ధర్మపురిలో సర్వే చేయించారనే ఆరోపణలు గులాబీశ్రేణుల కోపానికి మరింత ఆజ్యం పోశాయి.

tdp-trs-party

ఈ క్రమంలో తెలంగాణవాదానికి అప్పట్లో అడ్డుపడిన చంద్రబాబును టార్గెట్ చేస్తూ టీడీపీని బలహీనపరిస్తే కాంగ్రెస్ బలం తగ్గుతుందనేది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ప్రచారపర్వంలో టీడీపీని టార్గెట్ చేస్తూ గులాబీనేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలనేది వారి లక్ష్యంగా కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంటే తెలంగాణ ఏర్పడ్డాక ఆ పార్టీ క్యాడర్ ను చాలావరకు తమవైపు తిప్పుకున్నారు గులాబీ నేతలు. దీంతో టీడీపీని తెలంగాణలో కనుమరుగు చేయాలనే టీఆర్ఎస్ లక్ష్యం దాదాపుగా నెరవేరినట్లయింది. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని ఇక ముందస్తు ఎన్నికల్లో బలం చాలక పోటీలో ఉండకపోవచ్చని గులాబీనేతలు భావించారు. అనూహ్యంగా కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తుకు సిద్ధమవడంతో టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కేసీఆర్ తెలుగుదేశాన్ని అంతగా టార్గెట్ చేసారని విశ్లేషకులు భావిస్తున్నారు.