కేసీఆర్ నిర్ణయం జనసేన పార్టీ వర్గాలను, పవన్ కళ్యాణ్ ని కలవరపెడుతోందట. కారు స్పీడు పెంచేసి.. తెలంగాణలో విజయకేతనం ఎగరవేసి గులాబీ మయం చేసిన కేసీఆర్ మరికొద్ది రోజుల్లో ఏపీ రాజకీయాల్లోనూ వేలు పెట్టబోతున్నారనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే అక్కడ ఎవరికి మద్దతిస్తారనే కోణంలో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం అవుతానంటూ పవన్ వ్యక్తీకరిస్తున్న ధైర్యం దెబ్బతీసేలా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారనే న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. అంతకుముందు తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని పేర్కొన్న పవన్ తాము బరి లో దిగడం లేదని సమర్థులైన నేతని ఎన్నుకోవాలన్నారు. అయితే అంతర్గతంగా జనసేన పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని పార్టీ వర్గాలకు సానుభూతిపరులకు సూచించినట్లు వారు తగు విధంగా నడుచుకున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు అందరిచూపు ఏపీలో కేసీఆర్ పోషించే పాత్రపై పడింది. సహజంగానే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న వారికి కేసీఆర్ మద్దతు ఇవ్వబోతున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లలో ఎవరికి గులాబీ దళపతి మద్దతు ఇవ్వనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న తరుణంలో కేసీఆర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు వినిపిస్తున్న సమాచారం జనసేన వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఒకవేళ టీఆర్ఎస్ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ప్రచారం నిజమైతే జనసేన పార్టీకి భారీ షాక్ తిన్నట్లేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.