చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసినందుకే తాను ఏపీలో అడుగు పెడతానని చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ఎన్నికలలో గెలిచిన ఉత్సాహంలో ప్రకటించారు. ఈ రిటర్న్ గిఫ్ట్ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అంటే ఏం చేస్తారా అన్న చర్చలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే కచ్చితంగా ఇవ్వాల్సిందేనని డు రాష్ట్రాల నేతలు అంటున్నారు. విచిత్రంగా టీఆర్ఎస్ నేతలు తెలంగాణలో రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ఉంటుందని కాస్త హెచ్చరిక స్వరంతో చెబుతున్నారు కానీ ఏపీలో వైసీపీ, జనసేన నేతలు మాత్రం స్పందించడం లేదు. విచిత్రంగా టీడీపీ నేతలు మాత్రం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నామన్నట్లుగా ప్రకటిస్తున్నారు. చంద్రబాబు కూడా తాజాగా టీడీపీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో దీనిపై స్పందించారు. ప్రజాస్వామ్యం లో కేసీఆర్ కు ఎక్కడైనా పోటీ చేసే.. ప్రచారం చేసుకునే అవకాశం ఉందన్నారు. బెదిరింపులకు భయపడేది లేదని ఏమైనా చేసుకోవచ్చన్నారు. వైసీపీ, జనసేనలను కలిపి కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడన్న విశ్లేషణలు రాజకీయవర్గాల్లో జరుగుతున్నాయి. అయితే కేసీఆర్ తాను స్వయంగా ఏపీకి వెళ్తానని ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే ఏపీలో వెలమ సంఘాల పేరుతో ఆయా సామాజికవర్గాల జనాభా ఉన్న చోట ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అలాంటి వారందరూ తనను పిలుస్తున్నారని కేసీఆర్ భావిస్తున్నారు. అంతేకాక ఒకరకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తెలంగాణలో ఆ పార్టీ శ్రేణుల్ని ఆనంద పరిచింది. ఇది సహజమే. తమ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి.. వారికి ఆ ఆనందం ఉంటుంది. మరి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు ఎందుకు.. టీఆర్ఎస్ విజయాన్ని కలసికట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాయి. అటు జగన్ , ఇటు పవన్ .. ఇద్దరూ ఒకరి మగతనం మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు కానీ ఇద్దరూ కలిసి టీఆర్ఎస్ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచారంలో, తాను జాతీయ రాజకీయాలలోకి వెళ్ళవలసిన అవసరం ఉందని, దేశాన్ని కాపాడ వలసిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉందని, 1994 నాటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి తాను ఢిల్లీ వెళ్లి చక్రం తిప్ప వలసిన పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయని ప్రచారం చేశారు. ‘సేవ్ ది నేషన్ సేవ్ ది డెమోక్రసీ’ అంటూ స్లోగన్ కూడా ఇచ్చి కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపారు. మోడీ వ్యతిరేకులం అందర్నీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చే బాధ్యత తన భుజాలమీద ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచి, బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వడం లో తెలుగు వారిని మోసం చేసింది కాబట్టి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని అభిప్రాయం కలవారి నుంచి, మొదటి నుండి చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ పై సదభిప్రాయం ఉన్నవారి నుంచి ఈ ప్రచారానికి ఆ స్లోగన్ కి మంచి స్పందన వచ్చింది. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులు మారాయి. దశాబ్దాలుగా పార్టీ ఉన్న కారణంగా, అక్కడ ఉన్న లీడర్లను కేడర్ను మరి కొంతకాలం పాటు కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే క్యాడర్ను లీడర్లను కాపాడుకోవడానికి కాంగ్రెస్తో పెట్టుకున్న పొత్తు దారుణంగా బెడిసికొట్టింది. దీంతో చంద్రబాబు చాణక్యత మీద ఉన్న నమ్మకం పెట్టుకున్న వారికి కంగుతిన్నట్టు అయింది. జగన్ కి అత్యంత కంచుకోటగా భావించే రాయలసీమలో, అందులోనూ 2014 లో వైఎస్ఆర్ సీపీ గెలుచుకున్న నంద్యాల సీటు ని అంత భారీ మెజారిటీతో గెలుచుకోవడం పార్టీకి సహజంగానే ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఆ ఉత్సాహం ఆ ఊపు మొత్తం ఇప్పుడు తెలంగాణలో ఎదురైన పరాభవం తో కొట్టుకుపోయింది. దీంతో ఇప్పుడు ఆయన దేశం సంగతి పక్కన పెట్టి తెలుగుదేశం సంగతి చూసే పనిలో పడ్డారు. వాస్తవానికి అయితే ఇక్కడ జనసేన, వైకాపాలు రెండూ చంద్రబాబుని, ఆయన కూటమిని ఓడించామని అందులో తమ పాత్ర కూడా ఉందని భావిస్తూ సంబరం చేసుకున్నారు. అయితే వారు మరచిన మరో విషయం ఏంటంటే వారు శత్రువుని ఒక చోట దెబ్బతీసి శత్రువు అలెర్ట్ అయ్యేలా చేసుకున్నారు. మామూలుగా అయితే బాబు ఇక్కడ కూటమి గెలిచి ఉంటే రెట్టించిన ఉత్సాహంతో దేశం అంతా కొన్ని రౌండ్లు వేసి జాతీయ కూటమిలో బిజీ అయ్యెవాడు, కానీ ఇప్పుడు ఇంతమంది కుమ్మక్కు అయ్యారన్న సందర్భంగా ఆయన ఆ ప్రయత్నాల మీద పెట్టె శ్రద్ధ కంటే ఎకువ పెట్టేలా చేశారు.