Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్ లోని అజీంనగర్ ప్రాంతానికి చెందిన ఖాసీం అనే వ్యక్తి ట్రక్ డ్రైవర్. అతడు గుల్ అఫ్షాన్ అనే యువతిని నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. పెళ్లయిన తర్వాతిరోజు నుంచే మద్యం తాగి ఇంటికివచ్చి ఆమెను కొట్టడం ప్రారంభించాడు. అయినా అతని దుర్మార్గాన్ని భార్య భరిస్తూ వచ్చింది. కానీ అతని ప్రవర్తనలో మాత్రం మార్పురాలేదు. ఇది చాలదన్నట్టు ఖాసిం తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పి ఇంటినుంచి వెళ్లగొట్టాడు. అతను తలాక్ చెప్పిన కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఆలస్యంగా నిద్రలేచిందన్న కోపంతో ఖాసిం గుల్ కు తలాక్ చెప్పాడు. దీంతో ఆ మహిళ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపి భోరున ఏడ్చింది. తన భర్త మద్యం తాగి వచ్చి రాత్రి తనను కొట్టాడని, ఒంటినొప్పులతో బాధపడుతూ కాస్త ఎక్కువగా నిద్రపోయానని తెలిపింది. భర్త ఇంటి నుంచి గెంటివేయడంతో గుల్ ప్రస్తుతం తన తల్లిదండ్రులవద్దకు వెళ్లింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్బంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ కేసు గురించి వివరించారు. ఆలస్యంగా నిద్రలేచినందుకు కూడా విడాకులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇదే కాదని, ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సైతం ఇలాంటివి వంద కేసులు వెలుగుచూశాయని మంత్రి అన్నారు. ఈ బిల్లును ఓటుబ్యాంకు రూపంలో చూడవద్దని కోరారు. ఇది ముస్లిం మహిళల గౌరవానికి సంబంధించిన విషయమన్నారు. ట్రిపుల్ తలాక్ ను పాకిస్థాన్ లోనూ నిషేధించారని గుర్తుచేశారు.