అఖిలేష్ కి ఘోర అవమానం…!

Khilesh Yadav Says Detained While Trying Board Plane

ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు ఈరోజు ఘోర అవమానం జరిగింది. లక్నో విమానాశ్రయంలోనికి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయన భుజంపై చెయ్యి వేసి మరీ పక్కకు లాక్కెళ్లారు. ఈ ఘటనపై అఖిలేష్ యాదవ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, అక్కడి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లోని అలహాబాద్ విశ్వవిద్యాలయంలో సమాజ్ వాది పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి అఖిలేష్ యాదవ్ వెళ్లాల్సి ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఇనుప బ్యారికేడ్లను అడ్డుగా పెట్టిన పోలీసులు అఖిలేష్ ను లోనికి వెళ్లనివ్వలేదు. ఫ్లైట్ సమయం అవడంతో బలవంతగా లోనికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అఖిలేష్ ను అక్కడి పోలీసులు భుజంపై చెయ్యి వేసి పక్కకు తీసుకెళ్లారు. దీనికి ఆగ్రహానికి గురైన ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మీద చెయ్యి వెయ్యొద్దంటూ హెచ్చరించారు.

అయినప్పటికీ వారు వినిపించుకోక విమానం ఎక్కనివ్వకూడదంటూ తమకు ఆదేశాలు ఉన్నాయని అడ్డు తగిలారు. దీంతో యోగి ప్రభుత్వం అనుసరిస్తోన్న దౌర్జన్యానికి ఇది నిదర్శనమని అంటూ అఖిలేష్ యాదవ్ విమానాశ్రయంలోనే ఆందోళనకు దిగారు. అయితే ప్రయాగ్ రాజ్ లో అర్ధకుంభమేళా కొనసాగుతున్నందున అఖిలేష్ యాదవ్ అక్కడికి వెళ్తే, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు. ప్రయాగ్ రాజ్ లో పరిస్థితి అదుపు తప్పితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా అఖిలేష్ యాదవ్ ను అడ్డుకుంటున్నామని అంటున్నారు. అలాగే విద్యార్థి సంఘాల ప్రమాణ స్వీకారానికి రాజకీయ నాయకులు హాజరు కాకూడదని అలహాబాద్ యూనివర్శిటీ అధికారులు తమకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే అఖిలేష్ ను పోలీసులు విమానాశ్రయంలో అడ్డుకున్నారనే వార్తతో సమాజ్ వాది పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.