ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో నూతన అధ్యాయంగా అభివర్ణిస్తున్న ప్రక్రియ మొదలైంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఏర్పాటైన కియా మోటార్స్ కంపెనీ నుంచి తొలి కారు మంగళవారం రోడెక్కింది. ఈ కారును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక హ్యుందాయ్ అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్ పెనుగొండలో రూ.13,500కోట్ల పెట్టుబడితో 650 ఎకరాల్లో కియా కార్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ తయారైన తొలి మేడిన్ ఆంధ్రా కారు ఈరోజు బయటకు వచ్చింది. కియా కారును ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో కియా మోటార్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అతి తక్కువ సమయంలోనే తొలి కారును రూపొందించిన కియా సంస్థను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కరువు సీమగా ఉన్న రాయలసీమ కియా రాకతో రతనాల సీమగా మారుతోందన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దాలన్న సంకల్పతంతోనే ఎన్నో ప్రయాసలకోర్చి కియా సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి 11 వేల మందికి ఉపాధి లభించింది. ఈ ప్లాంట్‌లో గంటకు 50 సగటుతో ఏడాదికి 3 లక్షల కార్లు తయారవుతాయి.
కియా సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 14 ఉత్పత్తి కేంద్రాలు ఉండగా, ఇది 15వది. ఇప్పటి వరకూ భారత్ లో ఇది తొలి పరిశ్రమ. 2025 తర్వాత ఇదే ప్లాంట్ నుంచి కియా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కూడా ఆరంభించనున్నారు. పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడుతో పాటు, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కియాను తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ప్రత్యేక చొరవ చూపి, వ్యూహాత్మకంగా వ్యవహరించి ‘కియా మోటార్స్’ను అనంతపురానికి తీసుకురావడంలో విజయం సాధించారు. ఇది తెలుగుదేశం గర్వంగా చెప్పుకునే విషయాల్లో ఒకటిగా నిలవనుంది, ఎందుకంటే వైఎస్ సీఎంగా ఉన్న హయాంలోనే బొత్స రవాణా శాఖ మంత్రిగా వోక్స్ వాగన్ కంపెనీ తయారీ పరిశ్రమ పెట్టిస్తానంటూ వశిష్ట వాహన్ అనే అడ్రసులేని కంపెనీకిచ్చిన 11 కోట్లూ పోయాయి. రాష్ట్రానికి మాత్రం అప్రదిష్ట మిగిలింది, ఆ 11 కోట్లూ ప్రభుత్వం ఎవరికిచ్చిందో గానీ, ఐపూ అజా లేవు. అప్పట్లో కొందరు అధికారులు, అనధికారులు, మంత్రులు, అమంత్రులు వ్యవహారాన్ని సరిగా నిర్వహించలేదు గానీ మొత్తమ్మీద రాష్ట్రం దీనికోసం ప్రయత్నించిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నమ్మకం లేని కంపెనీల కోసం రాష్ట్రాలు తమలో తాము పోటీ పడితే వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి వ్యవహారాలు లేకపోతే తమ్ముళ్ళనీ, బామ్మర్దులనీ విదేశాలకు పంపడం కుదరదు. పైగా 11 కోట్లు ఎవరికో ఇచ్చేసి, సొమ్ములు పోనాయి అయితే ఏంటంట అని అడిగే అవకాశమూ ఉండదు.