ఆ టీడీపీ మంత్రి ఔట్… బాబుకు గవర్నర్ హెచ్చరిక

అప్పటి వరకూ రాజకీయాలతో నేరుగా సంబంధం లేకుండా అనూహ్యంగా మంత్రి పదవి చేపట్టిన ఆ యువకుడి అమాత్య కొలువు అర్ధాంతరంగా ముగియనుంది. తాను ఏ తప్పు చేయకున్నా సాంకేతిక ఇబ్బందులతో ఆయన మంత్రి పదవికి గండం ముంచుకొచ్చింది. మంత్రి పదవి చెప్పటి ఆరు నెలల సమయం కూడా పూర్తి చేసుకోకుండానే ఆ యువకుడు పదవిని త్యజించాల్సి వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అనేక మంది యువతకు మంత్రులుగా అవకాశాలు దక్కాయి. అదే జాబితాలో ఇటీవల చేరిన యువకుడు కిడారి శ్రవణ్ కుమార్. శ్రవణ్ తన శక్తి మేరకు పనిచేస్తూ ఈ ఆరు నెలలుగా వివాదాలకు దూరంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాంటి శ్రవణ్ కి మరో రెండు రోజుల్లో పదవీ గండం ముంచుకొచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రవణ్ పోలింగుకు ఫలితాలకు అసాధారణ గ్యాప్ ఉండడంతో చట్ట సభల్లో సభ్యుడు కాలేక పోయాడు. అదే ఇప్పుడు ఆయనకు అడ్డంకిగా మారింది. ఇప్పుడు పదవికే ఎసరు తెచ్చింది. రాష్ట్ర వైద్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చట్టసభల్లో సభ్యుడు కాని ఆయన గతేడాది నవంబరు 11న చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం.. మంత్రిగా నియమితులైన వారు ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాలి. శ్రావణ్‌కు ఆరునెలల వ్యవధి ఈ నెల 10తో ముగుస్తుంది. 11 నుంచి ఆయన మంత్రిగా కొనసాగడానికి వీల్లేదు. ఆయన తండ్రి, అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడంతో శ్రావణ్‌కు మంత్రిగా అవకాశం లభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర శాసనసభకు గత నెల 11నే పోలింగ్‌ జరిగినా.. ఫలితాలు ఈ నెల 23న వెలువడతాయి. ఈ ఎన్నికల్లో ఆయన గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మరికొన్ని రోజులు పడుతుంది. పదో తేదీతోనే ఆరునెలల గడువు ముగుస్తుండడంతో గవర్నర్ పేషీ అప్రమత్తమైంది. ఒక మంత్రి చట్ట సభల సభ్యుడు కాలేక ఆటోమేటిగ్గా పదవి కోల్పోవడం అవమానకరంగా ఉంటుందని అందువల్ల పదో తేదీలోపే శ్రావణ్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని గవర్నర్‌ నరసింహన్‌ ఏపీ సీఎంకు సూచించినట్లు తెలిసింది. కాబట్టి ఇవ్వాలో రేపో శ్రవణ్ రాజీనామా చేయాల్సిందే.