వచ్చే ఎన్నికల్లో 150 ప్లస్ టార్గెట్గా పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు 126 మంది పేర్లతో తొలి జాబితాను గురువారం అర్ధరాత్రి విడుదల చేశారు. ఇందులో సీనియర్ల వారసులతో సహా 83 మంది సిట్టింగులకు అవకాశం దక్కింది. కీలకమైన స్థానాల్లో యువకులకు సీట్లు కేటాయించారు. ఇక, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి యువనేతను రంగంలోకి దింపి ఆశ్చర్యానికి గురిచేశారు. తన కంచుకోట చీపురపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బొత్స ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని దాదాపు 23 వేల ఓట్లతో విజయం సాధించి బొత్సకు ఝలక్ ఇచ్చారు. ఆమెకు మంత్రివర్గంలోనూ చంద్రబాబు స్థానం కల్పించారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని, తన స్థానంలో కుమారుడికి సీటు కేటాయించాలని చంద్రబాబును మృణాళిని కోరారు. దీంతో ఆమె విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం, చీపురపల్లి అభ్యర్థిగా ఆమె కుమారుడు కిమిడి నాగార్జునను ప్రకటించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది. అదే 2004, 2009 ఎన్నికల్లో బొత్స సత్యన్నారాయణ కాంగ్రెస్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే, చీపురపల్లిలో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొత్స రెండో స్థానంలో నిలిచారు. తర్వాత వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ నుంచే ఆయన మరోసారి పోటీచేయనున్నారు. యువకుడైన నాగార్జున ఏమేరకు బొత్సను నిలువరిస్తారోనని ఆసక్తి నెలకొంది.