మీడియా ముందుకు వచ్చిన కోడెల…కే ట్యాక్స్ మీద క్లారిటీ

kodela shivaprasad rao came in front of media

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎట్టకేలకి మీడియా ముందుకు వచ్చారు. గత కొంతకాలంగా ఆయన కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. తన కుటుంబ సభ్యులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇలా ఎంతవరకు ఎన్ని కేసులు పెడతారో తనకు తెలియదన్నారు. వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టే మీడియా ముందుకు వచ్చానన్నారు. అవినీతిని అడ్డం పెట్టుకొని వేధిస్తే ఊరుకోమన్నారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు. స్పీకర్ పదవికి కళంకం తెచ్చానని వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై కోడెల స్పందించారు. స్పీకర్‌గా నిష్పాక్షికంగా పనిచేశానని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించినప్పుడు కూడా సభకు రావాలని ఆహ్వానించానని గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు… తప్పుడు కేసులు పెట్టమని జనాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తాను తొలి స్పీకర్‌గా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్న కోడెల.. తనను అధికార ప్రతిపక్ష నాయకులు ఏకగ్రీవంగా ఆ పదవిలో కూర్చోబెట్టినట్టు చెప్పారు. స్పీకర్‌గా తానెప్పుడూ తప్పుడు పనులు చేయలేదన్నారు. అందరికీ అవకాశం ఇచ్చానని, కొత్త శాసనసభ కావడంతో అవగాహన సదస్సులు కూడా నిర్వహించినట్టు చెప్పారు. తన కుటుంబ సభ్యులపై ఇప్పటి వరకు ఏడెనిమిది కేసులు పెట్టారని, ఈ రోజు కూడా రెండుమూడు కేసులు పెట్టినట్టు తెలిసిందన్నారు. వారు ఎన్ని కేసులు పెడతారో, ఎంత వరకు పెడతారో తనకు తెలియదన్నారు. తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారని, వారి పనులు వారు చేసుకుంటున్నారని ఎన్నోసార్లు చెప్పానని కోడెల గుర్తు చేశారు. తన కుమార్తె ఫార్మా కంపెనీ ద్వారా, కుమారుడి హీరో షోరూం ద్వారా 400 మందికి ఉపాధి కల్పించామని, ఇప్పుడు వారి పొట్ట కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. తమను బెదిరించి తప్పుడు కేసులు పెడుతున్నారని కోడెల ఆరోపించారు. తమపై చేసే ఏ ఒక్క ఆరోపణకైనా ఒక్క ఆధారం చూపించాలని డిమాండ్ చేశారు. కేసులకు బెదిరిపోబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం మంచి చేస్తే తాము కూడా మద్దతు ఇస్తామని, కానీ ఇలాంటి బెదిరింపు ధోరణి సరికాదని హితవు పలికారు. అధికారం ఉంది కదా అని అక్రమాలకు పాల్పడినా, వేధింపులకు గురిచేసినా అందరం కలిసికట్టుగా పోరాడతామని కోడెల హెచ్చరించారు.