అదేంటి.. చనిపోయిన హీరోను మళ్లీ బతికించడం ఏంటి.. అసలు మరణించిన వాళ్లకు మళ్లీ ఎలా ప్రాణం పోస్తారు అనుకుంటున్నారా..? అవును.. నిజమే కానీ సృష్టికి ప్రతిసృష్టి చేసాడు కోడి రామకృష్ణ. అలా చేసిన ఏకైక దర్శకుడు ఈయనే అయ్యుంటాడు కూడా. ఎందుకంటే చనిపోయిన హీరోతో మళ్లీ ఓ సినిమా చేసి ఔరా అనిపించాడు ఈ దర్శకుడు. అసలు తెలుగు ఇండస్ట్రీలో విజువల్ ఎఫెక్ట్స్ ఎలా వాడుకోవాలో పక్కాగా తెలిసిన దర్శకుడు రాజమౌళి.. కానీ ఈయన కంటే ముందే తెలుగు ఇండస్ట్రీలో గ్రాఫిక్స్ తో మాయాజాలం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. అసలు గ్రాఫిక్స్ అంటే ప్రేక్షకులకు తెలియని కాలంలోనే అమ్మోరుతో అద్భుతం చేసాడీయన. ఆ సినిమాలో వచ్చిన విజువల్ ఎఫెక్ట్స్ కు అప్పట్లో ప్రేక్షకులు నోరెళ్లబెట్టడం తప్ప ఏం చేయలేకపోయారు.
ఆ తర్వాత అంజి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఏకంగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు కోడి. అరుంధతి సంచలనం గురించి ఎవరూ అంత తేలిగ్గా మరిచిపోరు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో అరుంధతితో సంచలనం సృష్టించారు కోడి రామకృష్ణ. చాలా ఏళ్లు ఖాళీగానే ఉన్న ఈయన.. మూడేళ్ల కింద నాగభరణం అనే సినిమా చేసాడు.ఈ సినిమా డిజాస్టర్ అయింది. కానీ ఇందులో ఓ విశేషం ఉంది. ఇందులో హీరో చనిపోయి పదేళ్ళవుతుంది. కన్నడ సూపర్ స్టార్ దివంగత డాక్టర్ విష్ణువర్ధన్ ఇందులో అతిథి పాత్రలో నటించాడు. ఆయన్ని విజువల్ ఎఫెక్ట్స్ తో మళ్లీ సృష్టించాడు కోడి రామకృష్ణ. 450 మందికి పైగా టెక్నికల్ టీం కష్టం.. రెండేళ్ల శ్రమకు పలితంగా ఈ సినిమా వచ్చింది. నాగరహువు టీజర్ అప్పట్లో యూ ట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. ఇండియాలోనే తొలిసారి ఓ చనిపోయిన హీరోతో సినిమా చేయడం కోడి రామకృష్ణకే చెల్లింది. మొత్తానికి కోడి రామకృష్ణ మరణించినా ఆయన చేసిన అద్భుతాలు మాత్రం ఇంకా కళ్లముందే ఉన్నాయి.