Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ కాంగ్రెస్ లో ఇన్నాళ్లు లోలోన కుంపటిలా రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు ఏకంగా హైకమాండ్ కే డెడ్ లైన్ పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ని ప్రక్షాళన చేసే ఆలోచన లేదని హైకమాండ్ అధికారికంగా చెప్పేస్తే తాము పార్టీ వదిలి వెళ్లిపోతామని కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తమ్ నాయకత్వంలో 2019 ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ కి ఐదారు సీట్లు కూడా రావన్నారు ఆయన. పార్టీలో పొమ్మనకుండా తమకి పొగ పెడుతున్నారని వెంకటరెడ్డి ఆవేదన చెందారు. అందులో భాగంగానే పార్టీ శిక్షణ కార్యక్రమం లో తమని అవమానించారని వెంకటరెడ్డి వాపోయారు. పోరాటం ద్వారా గాకుండా లాబీయింగ్ ని నమ్ముకుని ఉత్తమ్ పీసీసీ పీఠం సంపాదించుకున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను మంత్రి పదవి వదిలిస్తే దాన్ని ఉత్తమ్ చేజిక్కించుకున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
తాజాగా వెంకటరెడ్డి కామెంట్స్ తో ఇన్నాళ్లుగా వాళ్ళు బీజేపీ లో చేరతారని వస్తున్న వార్తలకు బలం చేకూరింది. ఇప్పటిదాకా ఉత్తమ్ ని టార్గెట్ చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు ఏకంగా హైకమాండ్ కి వార్నింగ్ ఇవ్వడం మారిన వారి ఆలోచనా ధోరణికి అద్దం పడుతోంది. ఇక తాడోపేడో తేల్చుకోడానికే కోమటిరెడ్డి బ్రదర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. తమ డిమాండ్ కి భయపడి హైకమాండ్ పిలిపిస్తే ఢిల్లీ వెళ్లి తమ వాణి వినిపించాలని, లేదంటే బీజేపీ లో చేరిపోవాలని నిర్ణయించుకున్నాకే కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి తాజా ప్రకటన వచ్చిందట. మున్ముందు ఈ స్టేట్ మెంట్ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఏ మార్పులు తెస్తుందో వేచి చూడాలి.
మరిన్ని వార్తలు: